(P.Srinivas,New18,Karimnagar)
జనంలో మూర్ఖత్వం వీడనంత కాలం, మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడినన్ని రోజులు క్షుద్రపూజలు, మంత్రగాళ్లు, తాంత్రికపూజలు జరుగుతూనే ఉంటాయి. కాలం కంప్యూటర్ కంటే వేగంగా పరుగులు పెడుతుంటే..జనం మాత్రం గుప్త నిధులు, బంగారు గనులు, నిధి నిక్షేపాలంటూ జనాన్ని భయపెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి(Peddapalli)జిల్లాలో సుల్తానాబాద్(Sultanabad)మండలం తొగర్రాయి(Togarrayi)పాండవుల గుట్టపై కూడా ఇదే సాకుతో కొందరు కేటుగాళ్లు తవ్వకాలు మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగాని బంగారు నాణెల కోసం గుట్టపైన క్షుద్ర పూజాలు, తవ్వకాలు జరుపుతున్నారు. అయితే రాజులు దాచి పెట్టిన బంగారం, నగలు గుట్టల్లో ఉన్నాయనేది చాల మంది అనుమానం. ఆ డౌట్తోనే గుప్త నిధుల వేటగాళ్లు మంత్రగాళ్ల సాయంతో తవ్వకాలు జరుపుతున్నారు. గతంలో గుప్త నిధుల వేటలో పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు ఉన్నారు.
గుప్తనిధులు, బంగారు నిధి కోసం వేట..
తాజాగా మరోసారి పెద్దపల్లి జిల్లాలో గుప్త నిధుల వేట కలకలం రేపుతున్నాయి. చారిత్రత్మక గుట్టగా పేరుగాంచిన పాండవుల గుట్టలో లంకె బిందెలు, బంగారు నాణేలు ఉన్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతుండటంతో స్థానికులు భయపడిపోతున్నారు. తొగర్రాయి గ్రామానికి చాలా ఏళ్ల చరిత్ర ఉంది. ఊరి చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. ప్రకృతి రమణీయతతో మనస్సు దోచుకుంటున్న ఈ ప్రాంతంలోనే పాండవుల గుట్ట ఉంది . ఈ ప్రాంతాన్ని శాతవాహనులు , కాకతీయ రాజులు పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది . వనవాస కాలంలో పాండవులు ఈ ప్రాంతంలో సంచరించినట్లుగా తెలుస్తుండగా .. ఇక్కడ లభించిన ఆధారాలతో ఈ గుట్టను పాండవుల గుట్టగా పిలుస్తున్నారు స్థానికులు.
భిన్నప్రచారం..
జిల్లా ప్రజలు పాండవుల గుట్టగా పిలుస్తుంటే కేటుగాళ్లు మాత్రం ఇది గుట్ట కాదని .. బంగారు గని ప్రచారం చేస్తున్నారు. గతంలో ఈ గుట్ట ప్రాంతంలో బంగారు నాణేలు లభించినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. దాంతో నిజంగానే ఈ గుట్ట కింద బంగారు సంపద దాచి పెట్టారని వాటి కోసమే తవ్వకాలు జరుపుతున్నారని .. దేవతా విగ్రహాలను సైతం ఎత్తుకెళ్లారనే మాటలు వినిపిస్తున్నాయి.
చరిత్రను తొవ్వేస్తున్నారు..
పాండవుల గుట్ట కింద గుప్త నిధులు, బంగారు నాణెలు ఉన్న మాట పక్కన పెడితే వాటిని దక్కించుకోవాలనే దుర్బుద్దితో జిల్లాలో ఉన్న కేటుగాళ్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి క్షుద్రపూజలు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా క్షుద్రపూజలు చేసి వాటిని ఇక్కడి నుంచి తరలించుకుపోయారని తొగర్రాయి గ్రామస్తులు అంటున్నారు. జేసీబీ సాయంతో గుట్టను తొవ్వుతుండగా మంటలు చెలరేగి డ్రైవర్ చనిపోయాడనే ప్రచారం కూడా ఉంది. ఓవైపు క్షుద్రపూజలు మరోవైపు తవ్వకాలతో పాండవుల గుట్ట వైపు వెళ్లాలంటేనే స్థానికులు జంకుతున్నారు.
ఇప్పటికైనా అడ్డుకోండి..
ఉందో లేదో తెలియని గుప్త సంపద కోసం జంతుబలి, నరబలి ఇచ్చే ప్రమాదం ఉండటంతో గుట్టవైపు వెళ్లాలంటే జనం వణికిపోతున్నారు. ఇలాంటి భయాందోళన పరిస్థితులను గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకుళ్లినప్పటికి పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా పాండవుల గుట్ట దగ్గర తొవ్వకాలు, క్షుద్రపూజలు జరగకుండా చూసి గ్రామస్తుల్లో ఉన్న భయాందోళనను తొలగిచాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Peddapalli, Telangana