(Srinivas, Karimnagar, News18)
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ చోటు చేసుకుంటుందో అర్ధం కాకుండా ఉంది. టీఆర్ఎస్ - బీజేపీ - కాంగ్రెస్ పార్టీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ జరుగుతుంది .ఎవరికి వారు పైచేయి సాధించే క్రమంలో రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తుంది. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. గజ్వేల్ లో పోటీ విషయం బీజేపీ అధిష్టానానికి కూడా చెప్పానని ఈటల అంటున్నారు . వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈటల చెబుతున్నారు. అలాగే కేసీఆర్ ని ఓడించడానికి గజ్వేల్ లో ఇప్పటినుంచి సీరియస్ గా వర్క్ చేస్తున్నామని ప్రకటించారు.
దాదాపు 18 ఏళ్ల పాటు కేసీఆర్ తో కలిసి పనిచేసిన ఈటల.. టీఆర్ఎస్ వదిలి బీజేపీలోకి రావడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈటలని కేసీఆర్ ఏ విధంగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేలా చేశారో కూడా తెలిసిందే. బీజేపీలోకి వచ్చాక ఈటల ... కేసీఆర్ టార్గెట్ గా రాజకీయ వ్యూహాలు పన్నుతూ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ అయ్యారు. అలాగే విజయసంకల్ప సభ తర్వాత ఈటల మరింత దూకుడు పెంచారు. పైగా అంతకముందు అమిత్ షాతో భేటీ అయ్యి కూడా వచ్చారు. మరి ఆ భేటీలో ఏం మాట్లాడుకున్నారో తెలియదు గాని ... ఇప్పుడు బీజేపీలో ఈటల దూకుడు పెంచారు.
ఈటల గజ్వేల్ వెళ్తే ఇన్నాళ్లూ గెలిపించిన హుజూరాబాద్ పరిస్థితి ఏంటి?
2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన నాలుగు సాధారణ ఎన్నికలు, మూడు ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను అందలం ఎక్కించారు హుజురాబాద్ ఓటర్లు. కమలాపూర్, హుజురాబాద్ ల నుంచి వరసగా ఏడు సార్లు విజయం సాధించిన ఈటల ఉన్నట్టుండి గజ్వేల్ వైపు చూడడంపై హుజురాబాద్ ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఈటల కమలాపూర్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే నాటికే అత్యంత బలమైన నాయకుడు ముద్దసాని దామోదర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎదురులేని నాయకునిగా పట్టు నిలుపుకున్న దామోదర్ రెడ్డిపై విజయం సాధించడానికి ఈటల ‘మీ బిడ్డను ఆదరించండి’ అన్న నినాదాన్ని వినిపించారు. గత సంవత్సర జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభావాన్ని కాదని ఈటల వైపే మొగ్గు చూపారు ఇక్కడి జనం. అయితే తాను గజ్వేల్ నుండి పోటీ చేస్తానని , మొదట తాను చేరింది కూడా ఇదే నియోజకవర్గం నుండేనని ప్రకటించడం హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు చర్చకు దారి తీసింది.
తమ ఇంటి పెద్ద కొడుకులాగా చూసుకున్న తమ బిడ్డ వలస పోతున్నాడా లేక ఇక్కడకే వలస వచ్చానని భావించాడా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అప్పటి నుండే ఆయన దృష్టి అంతా గజ్వేల్ పై ఉందని వారున్నారు. ఈటల ఇన్ని రోజులు ఈ నియోజకవర్గాన్ని స్టాండ్ బై గా ఎంచుకున్నారని అంటున్న వారూ లేకపోలేరు. ఏది ఏమైనప్పటికీ ఈటల కామెంట్స్ కు హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు ఒకింత అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Eatala rajender, Eetala rajender, Huzurabad, Telangana, Telangana bjp, Trs