ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవిశ్వాస తీర్మానాలతో అట్టుడికిపోతుంది రాజకీయం. మొన్న జగిత్యాల, నిన్న రామగుండం, నేడు హుజురాబాద్ మున్సిపాలిటీలో అసమ్మతి రాగం రాజుకుంది. గుట్టు చప్పుడుకాకుండా నిన్న హుజురాబాద్ 25 మంది కౌన్సిలర్లు సమాలోచనలు జరిపి చైర్ పర్సన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గురువారం కరీంనగర్ కలెక్టరేట్ లో అధికారులకు అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. దీంతో మరో మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలో ముసలం మొదలైనట్టయింది.
సొంత నిర్ణయాలే కారణమా?
అయితే హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక ఒంటెద్దు పోకడలే కారణమని కౌన్సిలర్లు స్పష్టం చేశారు. రాధికను ఎన్నుకునే ముందు పట్టణంలోని అన్ని వార్డుల్లో నిధులను వెచ్చిస్తానని మాట ఇచ్చారని..ఇప్పుడు మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ తమ వార్డులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. సభ్యులెవరికి ఎజెండా అంశాలను తెలియనివ్వకుండా తనకు అనుకూలమైన అంశాలను ప్రవేశపెట్టి తీర్మానాలు చేయించుకున్నారని, ప్రశ్నించిన సభ్యులన బెదిరింపులకు గురి చేశారని వారు వివరించారు. అంతేకాకుండా రాధిక భర్త గందె శ్రీనివాస్ కూడా యాక్టింగ్ చైర్మన్ గా వ్యవహరిస్తూ మున్సిపల్ అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ..బినామీలచే కాంట్రాక్టు పనులు చేయిస్తూ..కమిషన్లు దండుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు.
ఈ విషయాలన్నింటిని గతంలోనే ఛైర్ పర్సన్ రాధిక దృష్టికి తీసుకురాగా..వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కౌన్సిల్ సభ్యులను అపహాస్యానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు దోచుకునే విధానల వల్ల పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున మెజార్టీ సభ్యులమైన తాము చైర్ పర్సన్ గందె రాధిక పై అవిశ్వాస తీర్మానం చేసేందుకు నిర్ణయించుకున్నామని కౌన్సిలర్లు కలెక్టరేట్ కార్యాలయంలో ఇచ్చిన నోటీసులో వివరించారు. అధిష్టానానికి చిక్కుకుండా తమ పంథాన్నిహుజురాబాద్ కౌన్సిలర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించి నెగ్గించుకున్నారు. అసమ్మతి రాగం వినిపిస్తున్న 25 మంది కౌన్సిలర్లు కూడా ఏకతాటిపైకి వచ్చి అవిశ్వాస నోటీసుకు సంబంధించిన లేఖపై సంతకాలు చేసి మూకుమ్మడిగా ఒక రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి ముగ్గురు ప్రతినిధులను కరీంనగర్ కలెక్టరేట్ కు పంపించి మిగతా వారంతా అక్కడే ఉండిపోయారు.
ఒక వేళ పార్టీ పెద్దల దృష్టికి అవిశ్వాస విషయం వెలుగులోకి వచ్చి తమను బుజ్జగించే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయని గమనించిన కౌన్సిలర్లు మొబైల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. అవిశ్వాస రాజకీయ తెరపైకి రావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రంగంలోకి దిగారు. కొంతమంది కౌన్సిలర్లను టచ్ లోకి తీసుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. మున్సిపల్ చైర్ పర్సన్ విషయంలో మీకు అండగా ఉంటానని నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కౌశిక్ రెడ్డి కౌన్సిలర్లను సముదాయించారు. అయినప్పటికీ కౌన్సిలర్లు మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో లేమని, చైర్ పర్సన్ రాధిక, ఆమె భర్త గందె శ్రీనివాస్ లపై అవిశ్వాసం పెడతామని స్పష్టం చేసినట్లు సమాచారం.
అవిశ్వాసం నెగ్గిన తర్వాత మరొకరిని ఎన్నుకునే విషయంలో పార్టీ ఎలా చెప్తే అలా వింటామని అధిష్టానం చెప్పిన వారికే తాము ఓటు వేస్తామన్న ప్రతిపాదన కూడా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముందు ఉంచినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటికే జగిత్యాల , రామగుండంలో అసమ్మతి రాగం వినిపించగా కొత్తగా హుజురాబాద్ తో అధిష్టానం తలలు పట్టుకుంటుంది. ఈ అవిశ్వాస తీర్మానాలపై పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BRS, Karimnagar, Telangana