భారత రాజ్యాంగాన్ని (Indian Constitution) మార్చాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ (Congress) తదితర పార్టీలు విరుచుకుపడుతున్నాయి. దీక్షలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. తాజాగా కరీంనగర్ (Karimnagar)లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Congress MLC Jeevan Reddy) కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రశ్నించకుండా దాని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ, టీఆర్ఎస్పై ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ కేసీఆర్ బాధ్యతారహితమైన ప్రకటనలు మానుకుని అంబేడ్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మొదటి నుంచి దళితులను కేసీఆర్ మోసం చేస్తూ, ఇప్పుడు రాజ్యాంగం మార్చాలంటూ కొత్త కుట్రకు తెర తీశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు రాజ్యాంగం అడ్డుగా ఉందని అక్కసుతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఎంతోమంది మహనీయుల త్యాగాలతో..
కేసీఆర్ లాంటి మూర్ఖపు నాయకుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. ఎంతోమంది మహనీయుల త్యాగాలతో రాజ్యాంగం రూపొందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తులు కమీషన్లు పెంచుకునేందుకు రాజ్యాంగాన్ని మార్చాలి అనుకుంటున్నారా..?
ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ అనర్హుడు..
అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆయన ముఖ్యమంత్రి అయిన విషయాన్ని కెసిఆర్ మర్చిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఎందుకు భారత రాజ్యాంగాన్ని మార్చాలో దేశ ప్రజలకు కేసీఆర్ చెప్పాలి. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ అనర్హుడు ఆయన ఆ పదవికి రాజీనామా చేయాలి.
దళిత జాతికి క్షమాపణ చెప్పాలి..
కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి. దళిత బహుజన వర్గాలకు చెందిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం పై కేసీఆర్ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ రాజ్యాంగం పై ఘాటుగా విమర్శలు చేసినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఆయనపై చర్యలు తీసుకోకుండా కేవలం ధర్నాలకు, దీక్షలకు పరిమితమవుతున్నారు.
పక్కదారి పట్టించేందుకే..
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రశ్నించకుండా దాని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. విభజన హామీలపై ఏనాడైనా కేసీఆర్ మోదీ గారిని కలిశారా.. ప్రశ్నించారా..? కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇలా ఎన్నో హామీలు ఇచ్చింది. వాటిలో ఒక్క హామీ అయిన అమలుకు నోచుకుందా..? టీఆర్ఎస్ బిజెపి పార్టీలు తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి. బీజేపీ ఎంపీలు కూడా రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు సాధనలో విఫలమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది. టీఆర్ఎస్ పాలనలో కేంద్రం నుంచి ఒక నూతన ప్రాజెక్ట్ అయినా సాధించారా..? రైల్వే బడ్జెట్లోనూ తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది, అయినప్పటికీ టీఆర్ఎస్ ఎంపీలు, తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు నోరు మెదపలేదు. దీంతో వారికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పై ఎంతటి చిత్తశుద్ధి ఉందో స్పష్టమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Jeevan reddy, Karimnagar, TS Congress