KARIMNAGAR AN ARTIST WHO IS INTERNATIONALLY RECOGNIZED FOR HIS PERFORMANCES BEGS TO BE SUPPORTED VB KNR
Telangana: నాడు కత్తులు తిప్పిన చేతులు.. నేడు సాయం కోసం ఎదురుచూపులు..
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారుడు
Telangana: తన విన్యాసాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఓ కళాకారుడు ఆకలితో అలమటిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితం అయ్యాడు. దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో విన్నించుకుంటున్నాడు.
(పి.శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా, న్యూస్18 తెలుగు)
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన ఆవుల కిషన్ కు చిన్నప్పటి నుంచే విన్యాసాలు అంటే మక్కువ. వాటినే వృత్తిగా చేసుకున్నాడు. 2011 జులై 6 వ తేదీన 22 పొడవాటి కత్తులు నోట్లో పెట్టుకుని గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నాడు. 2012 మార్చి 31 న మరోసారి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు . శ్రీలంక , లండన్ , మలేషియా , బెల్జియం , కెనడా , ఇటలీ , దుబాయ్ , కువైట్ తదితర దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. 32 జాతీయ చానళ్లలో తన ప్రోగ్రామ్స్ తో ప్రజలను కట్టిపడేశాడు. నోటిలో 22 కత్తులు పెట్టుకోవడం , కత్తులు తిప్పడం , కనురెప్ప లతో కుర్చీని పైకెత్తడం, బొంగరాలు, బంతులతో విన్యాసాలు చేయడం ఈయన ప్రత్యేకత. కిషన్ కు భార్య , ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. దేశ విదేశాల్లో ప్రదర్శనల కోసం ఉన్నదంతా ఖర్చు చేశాడు. పిల్లలందరికీ అప్పులు చేసి పెళ్లిళ్లు చేశాడు. కరోనా మహమ్మారి తన ఉపాధిని దెబ్బతీసింది. ఉపాధి లేక గత సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. గత సంవత్సరం.. సూగ్లం పల్లి వద్ద టిఫిన్ సెంటర్ పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకున్నాడు.
5 నెలల క్రితం సుగ్లాంపల్లి టిఫిన్ సెంటర్ వద్ద జరిగిన యాక్సిడెంట్ లో కాలుకు తీవ్ర గాయమైంది . ప్రైవేట్ డాక్టర్ సాయంతో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పూట గడవడం కష్టంగా ఉందని తెలియజేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కూడా రావట్లేదని కిషన్ వాపోతున్నాడు. దాతలు , ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వేడుకుంటున్నాడు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.