అనుమానం పెను భూతమైంది. తాగిన మత్తులో కట్టుకున్న భార్యను భర్తే అత్యంత కిరాతకంగా కత్తిపీటతో నరికి చంపాడు. తల్లి చనిపోయి, తండ్రి జైలుకు వెళ్లడంతో ముక్కుపచ్చ లారని ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. క్షణికావేశంలో చేసిన దాడితో ఆ ప్రబుద్దుడు కటకటాల పాలయ్యాడు. పోలీసులు, గ్రామస్తుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన బొల్లం రాజయ్య-శాంతమ్మ కుమారుడు బొల్లం జగదీశ్ (34)కు 2016లో వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామానికి చెందిన కండ్లె దేవయ్య-ఎల్లమ్మ కుమార్తె రాజేశ్వరి(26)ని ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు డేవిడ్ రాజ్ (5), రియాన్స్ (3). వివాహం జరిగిన కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగింది.
జగదీశ్ ఏ పని లేకుండా జులాయిగా తిరుగుతూ ఉండే వాడు. దీనికి తోడు మద్యానికి బానిసై భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు. ఈ విషయమై ఆమె పుట్టింటివారు పలుమార్లు నచ్చచెప్పినా అతని ప్రవర్తనలో మార్పు లేదు. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య ఏదో విషయమై ప్రారంభమైన గొడవ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ క్రమంలో జగదీశ్ పదునైన ఆయుధంతో రాజేశ్వరి దవడ, మెడ, వీపుపై విచక్షణా రహితంగా పొడిచాడు. కుడి చేతి చూపుడు వేలిని కోసి వేశాడు. అనంతరం కత్తిపీటతో గొంతుపై నరికాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడే మృతి చెందింది. పిల్లలు ఉదయం నిద్రలేచిన తరవాత తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి పక్కనే నివాసముండే తాత, నానమ్మలకు చెప్పారు.
సమాచారం అందుకున్న ధర్మపురి సీఐ కోటేశ్వర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజేశ్వరి సోదరుడు కండ్లె సామ్యూల్ ఫిర్యాదు మేరకు నిందితుడు జగదీశ్ తో పాటు కుటుంబ కలహాల్లో అతనికి మద్దతుగా నిలిచిన అతని తల్లిదండ్రులు బొల్లం రాజయ్య, శాంతమ్మ, సోదరుడు హిమాలయపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. అసలేమైందో కూడా తెలియని పసి వయసులో తల్లి మరణించి, తండ్రి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. పసిప్రాయంలో తల్లిదండ్రులు దూరమవడంతో ఆ ఇద్దరి ప్రేమకు దూరమయ్యారు.
నేరం చేసింది ఒకరైతే శిక్ష పిల్లలకు పడినట్లయింది. పిల్లలు ఏడుస్తున్న తీరును స్థానికులను కంటతడి పెట్టించింది. భార్యాభర్తల గొడవ మధ్య పిల్లలు అనాధలు అవుతున్న సంఘటనలు ప్రతిరోజు ఎన్నో చూస్తున్నాము. పిల్లల కోసమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరికి బాధ్యతని పోలీసులు అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Karimnagar, Murder, Telangana