షుగర్ ఫ్యాక్టరీ (Sugar Factory) నుంచి తిరిగొస్తున్న లారీ డ్రైవర్‌ను కొట్టి.. లారీని ఎత్తుకెళ్లారు దుండగులు. లారీతో పాటు పక్క రాష్ట్రానికి పారిపోయారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి..ఆ దొంగలను పట్టుకున్నారు. మహారాష్ట్ర (Maharashtra) లో లారీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేశ్ గౌడ్ అనే లారీ డ్రైవర్ సోమవారం సదాశివనగర్ పోలీసుస్టేషన్ పరిధి అడ్లూర్‌ఎల్లారెడ్డి శివారులోని గాయత్రి సుగర్స్‌కి వెళ్లాడు. అక్కడ చెరుకు లోడును దింపేసి.. తిరిగి వెళ్తుండగా ఓ వ్యక్తి లారీని ఆపాడు. తనకు ఆకలేస్తోందని దాబా దగ్గర దింపేయాలని రిక్వెస్ట్ చేశాడు. అతడు అనుమానాస్పదంగా కనిపించడంతో... లారీలో ఎక్కించుకునేందుకు డ్రైవర్ నిరాకరించి.. అలాగే ముందుకెళ్లాడు.
లారీ కొంత దూరం ముందుకు వెళ్లిన తర్వాత.. మహారాష్ట్రకు చెందిన ఓ స్కార్పియో రోడ్డుకు అడ్డంగా ఆపి ఉంది. దానిని చూసి లారీని ఆపాడు డ్రైవర్. వెంటనే ఆ కారులో నుంచి నలుగురు వ్యక్తులు దిగి.. డ్రైవర్ వద్దకు వెళ్లి.. గొడవపెట్టుకున్నారు. అతడిని కిందకి దింపి..తీవ్రంగా కొట్టారు. అనంతరం రమేశ్ గౌడ్‌ను స్కార్పియోలో ఎక్కించారు. లారీని తమతో పాటు తీసుకెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత.. స్కార్పియో నుంచి రమేశ్‌ను కిందకి దింపి.. మహారాష్ట్రకు పారిపోయారు. అసలు ఎక్కడ జరిగిందో డ్రైవర్‌కు అర్థం కాలేదు. వచ్చారు.. కొట్టారు.. లారీ ఎత్తుకెళ్లారు. ఇదంతా దొంగల ముఠా పని అని గుర్తించి.. వెంటనే డయల్ 100కి కాల్ చేసి సమాచారం అందజేశాడు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి సదాశివనగర్ సీఐ రామన్... దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలు పారిపోయిన స్కార్పియో వాహనాన్ని గుర్తించి.. దానిని వెంబడించారు. స్కార్పియోతో పాటు లారీ కూడా కామారెడ్డి , నిజామాబాద్ జిల్లాల మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు గుర్తించారు. చివరకు మహారాష్ట్రలోని ముదిఖేడ్ తాలూకా సమీపంలో వాహనాలు చిక్కాయి. ముఠా సభ్యుడైన విఠల్ తాలికాటిని అదుపులోకి తీసుకున్నారు. లారీ, స్కార్పియోతో పాటు నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు. నిందితుడు విఠల్‌ను రిమాండ్‌కు తరలించారు. 24 గంటల వ్యవధిలోనే లారీని స్వాధీనం చేసుకొని.. నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులను ఎస్పీ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Kamareddy, Local News, Telangana