KALVAKUNTLA KAVITHA TRIED HARD FOR VICTORY OF GANDHI NAGAR TRS CANDIDATE MUTA PADMA DEFEATED BY BJP AK
GHMC Election Results 2020: కవితకు మరోసారి షాకిచ్చిన బీజేపీ
కల్వకుంట్ల కవిత(ఫైల్ ఫోటో)
GHMC Election Results 2020: టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మపై బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పావని విజయం సాధించారు. దీంతో ముఠా పద్మ గెలుపు కోసం ప్రయత్నించిన కవితకు బీజేపీ షాక్ ఇచ్చినట్టయ్యింది.
GHMC Election Results 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో నువ్వా నేనా అనేలా ఫలితాలు సాధిస్తోంది బీజేపీ. నగరంలోని అనేక డివిజన్లకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలను ఇన్ఛార్జిలుగా నియమించి గెలుపు కోసం వ్యూహాలు రచించింది టీఆర్ఎస్. అయినా బీజేపీ దూకుడును మాత్రం ఆశించిన స్థాయిలో అడ్డుకోలేకపోయింది. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లకు సంబంధించి మిగతా నాయకుల తరహాలోనే గెలుపు బాధ్యతలను తీసుకున్నారు టీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావు, కవిత. ఈ క్రమంలో తాము బాధ్యత తీసుకున్న స్థానాల్లో టీఆర్ఎస్ను గెలిపించే విషయంలో కేటీఆర్, హరీశ్ రావు సక్సెస్ సాధించగా... ముషీరాబాద్ పరిధిలోని గాంధీ నగర్ డివిజన్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న కవిత మాత్రం టీఆర్ఎస్ను గెలిపించలేకపోయారు.
ఈ స్థానం నుంచి ముషీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సోదరుడి భార్య ముఠా పద్మ టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. బీజేపీ తరపున ఏనుగుల పావని పోటీ చేశారు. ఇరు పార్టీలు ప్రచారాన్ని హోరాహోరీగా చేశాయి. టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ముఠా పద్మను గెలిపించేందుకు కవిత ఎంతగానో శ్రమించారు. డివిజన్లోని అనేక బస్తీలు తిరిగి... టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అయినా ఫలితం మాత్రం టీఆర్ఎస్కు అనుకూలంగా రాలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మపై బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పావని విజయం సాధించారు. దీంతో ముఠా పద్మ గెలుపు కోసం ప్రయత్నించిన కవితకు బీజేపీ షాక్ ఇచ్చినట్టయ్యింది.