తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దాదాపుగా ఖాయమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇందుకు సంబంధించి సంకేతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా కేటీఆర్ పట్టాభిషేకానికి అంతా సిద్ధమైందని.. ఇక ముహూర్తం మాత్రమే మిగిలిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎంగా కేటీఆర్ ఎఫ్పుడు ప్రమాణం చేయబోతున్నారనే దానిపై టీఆర్ఎస్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే టీఆర్ఎస్లోని మరో ముఖ్యనేత, కేసీఆర్ కూతురు కవిత పరిస్థితి ఏంటనే దానిపై కూడా టీఆర్ఎస్లో ఆసక్తికర టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే.. కేసీఆర్ మంత్రివర్గం రద్దవుతుంది. తెలంగాణలో మళ్లీ కొత్త మంత్రివర్గం ఏర్పాటవుతుంది. అప్పుడు కేబినెట్ కూర్పులో కచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయని కొందరు భావిస్తున్నారు. ఆ మార్పుల్లో భాగంగా కవితకు కీలక పదవి దక్కుతుందనే చర్చ జరుగుతోంది.
కేటీఆర్ కేబినెట్లో కవితకు కచ్చితంగా చోటు దక్కుతుందని.. ఇప్పటివరకు కేటీఆర్ చూస్తున్న కీలకమైన మున్సిపల్ శాఖ కవితకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీఆర్ఎస్లోని కొందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవితను కేబినెట్లోకి తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసినప్పుడు కవితను మంత్రిని చేయాలని కేసీఆర్ గతంలోనే నిర్ణయించారని పలువురు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కవిత కోరిక కూడా ఈ విధంగా తీరుతుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

కేటీఆర్, కవిత ( ట్విట్టర్ ఫోటో )
గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవిత.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత... స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించడం మొదలుపెట్టారు. అలా శాసనమండలిలో అడుగుపెట్టిన కవిత.. మంత్రి అవుతారని చాలా రోజుల నుంచి వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం కవిత మంత్రి అయ్యేందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో ఆమె మంత్రి కావడం ఖాయమనే చర్చ జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:January 23, 2021, 14:21 IST