ఒకపక్క భారీ వర్షం (Heavy rains), మరోపక్క ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీరు పోటెత్తడంతో నిర్మల్ (Nirmal) జిల్లాలోని ప్రధాన సాగు నీటి ప్రాజెక్టు అయిన కడెం ప్రాజెక్టు (Kadem Project) ప్రమాదపు అంచుదాక వెళ్ళింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో ముప్పు తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలు జరిగింది ఏమిటంటే నిర్మల్ (Nirmal) జిల్లా కడెం మండలంలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టును భారీ వర్షాలు వరదలతో ముంచెత్తాయి. ఈ ప్రాజెక్టు సామర్ధ్యం 700 అడుగులు. అయితే సామర్ధ్యాన్ని మించి వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు వదిలిపెట్టారు. ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా, 17 గేట్లు మాత్రమే తెరుచుకున్నాయి. సాంకేతిక లోపంతో 18వ గేటు తెరుచుకోలేదు. ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరితే, మూడు లక్షల క్యూసెక్కుల నీటిని వదలగలిగారు. రెండు లక్షల క్యూసెక్కుల అదనపు నీటి ప్రవాహంతో ముంపు ఏర్పడింది. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం కంటే ఎత్తు నుండి ప్రవాహం ప్రాజెక్టు పై నుండి ప్రవహించడంతో భయబ్రాంతులకు లోనయ్యారు. దీంతో యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు దిగువన ఉన్నగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
1959లో భారీగా వరద..
కడెం ప్రాజెక్టు చరిత్రలో ఇలాంటి వరద (Floods) రావడం ఇది మూడోసారి. ఈ ప్రాజెక్టును నిర్మించిన కొంత కాలానికి అంటే 1959లో భారీగా వరద రావడంతో ప్రాజెక్టుకు ముప్పువాటిల్లడంతో అప్పడి ప్రభుత్వం 9 గేట్లు ఉన్న ప్రాజెక్టును 18 గేట్లతో పునర్నిర్మాణం చేశారు. 1995లో మరోసారి వరద వచ్చింది. అయితే ఆనాటి వరద కారణంగా ప్రాజెక్టుకు రెండు వైపులా ఉన్న ఆనకట్ట కోతకు గురైంది. దీంతో మరోసారి ప్రమాదం తప్పింది.
తాజాగా నిన్న మొన్నటి భారీ వర్షలతో మరోసారి ముప్పు ఏర్పడింది. ఈసారి ముప్పుతప్పదేమో అనుకున్నంతలోనే ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడటంతో భారీగా వరద నీరు బయటకు వెళ్ళిపోయింది. అటు ఎగువ ప్రాంతంలోనూ వర్షం తగ్గుముఖం పట్టడంతో నీటిమట్టం 683 అడుగులకు తగ్గింది. దీంతో మరోసారి ప్రాజెక్టుకు భారీ ముప్పు తప్పింది.
మరోసారి ఇలాంటి ముప్పు రావద్దంటే..
ప్రాజెక్టు ఉపరితలం నుండి ప్రవహించిన వరద నీటి ఉధృతితో గేట్లలో చెట్లు, కొమ్మలు ఇరుక్కుపోయి అస్థవ్యస్థంగా తయారైంది. రెండు గేట్ల కౌంటర్ వెయిట్ కొట్టుకుపోగా, మరో గేటు పగుళ్లు తేలింది. గేట్లలో ఇరుక్కుపోయిన చెత్తను, ఇతరత్రా వాటిని తొలగించాలంటే జెసిబిలు (JCB), క్రేన్ ల సహాయం తప్పనిసరి. ఏదిఏమైనప్పటికి మరోసారి ఇలాంటి ముప్పు రావద్దంటే తప్పనిసరిగా నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు వరధ ఉధృతి తగ్గడంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో సతీసమేతంగా పూజలు చేసి మొక్కు చెల్లించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.