KABADDI PLAYER FARMING TO SUPPORT HER PARENTS IN KHAMMAM DISTRICT KMM VB
Telangana News: కబడ్డీ క్రీడాకారిణి.. కాడెద్దులు కట్టి అరక పట్టింది.. ఇలా ఎందుకు మారిందో తెలుసా..
అరక పట్టి దున్నుతున్న కబడ్డీ క్రీడాకారిణి
Telangana News: ఆమె కబడ్డీ జట్టులో ఉందంటే ప్రత్యర్థులకు హడలే. కూతకు వెళ్లిందంటే పాయింట్ రావాల్సిందే. ఇలా ఆమె పాఠశాల స్థాయి నుంచి జాతీయ కబడ్డీ జట్టుకు ఆడేదాకా ప్రయాణించింది. అయితే ఒక్కసారిగి ఆమె కాడెద్దులు కట్టి అరక పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
(జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా)
ఆమె కబడ్డీ జట్టులో ఉందంటే ప్రత్యర్థులకు హడలే. కూతకు వెళ్లిందంటే పాయింట్ రావాల్సిందే. ప్రత్యర్థి జట్టు నుంచి ఎవరైనా కూతకు వస్తే తన ఉడుంపట్టుతో వారిని అడుగు ముందుకేయకుండా అడ్డుకుంటుంది. ఇలా ఆమె పాఠశాల స్థాయి నుంచి జాతీయ కబడ్డీ జట్టుకు ఆడేదాకా ప్రయాణించింది. ఆటలే ఊపిరిగా.. అవే జీవితంగా బతుకుతోంది. కానీ కరోనా దెబ్బకు ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మంచం పట్టారు. ఉన్న ఒక్క ఆధారమైన వ్యవసాయం చేసే దిక్కులేక ఆమె స్వయంగా హలం పట్టింది. తానే కాడెద్దులు కట్టి అరక కట్టింది. ఈ తొలకరి నుంచి తానే సాగు పనులు చేస్తూ ఇంటికి ఆసరాగా నిలుస్తోంది. ఇదో గిరిపుత్రిక కథ. భద్రాచలం సమీపంలోని దుమ్ముగూడెం మండలం రామచంద్రునిపేటకు చెందిన కారం రమ్య వ్యథ ఇది. ఆమె తల్లిదండ్రులు ఇరువురూ నాగమ్మ, లక్ష్మయ్యలు ఇద్దరూ మంచం పట్టారు. దీంతో ఆమె ప్రస్తుతం ఆ ఇంటికి పెద్ద దిక్కుగా మారింది. కోవిడ్-19 కరోనా వైరస్ ధాటికి ఎన్ని జీవితాలో అల్లకల్లోలమవగా.. ఇలా కొన్ని జీవితాలు కొన్ని కలలు కల్లలైపోయాయి. ఆమె అకాడమీలో ఉంటే ఆటల్లో ఇంకా ముందుకెళ్లే పరిస్థితులు ఉండేవి.
కానీ కుటుంబ పరిస్థితి బాగాలేకపోవడంతో ఇప్పుడు ఇలా ఆమె ఇంటిపట్టునే ఉండి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సి వస్తోంది. రమ్యకు చిన్ననాటి నుంచి ఆటలన్నా.. వ్యవసాయ పనులన్నా ఆసక్తి మెండు. దీంతో ఎప్పుడూ చురుగ్గా అన్ని ఆటల్లోనూ, పనుల్లోనూ పాలుపంచుకునేది. ఐదో తరగతి దాకా స్థానికంగా ఉండే ఆశ్రమ పాఠశాలలో చదివినా.. అనంతరం దుమ్ముగూడెం కస్తూర్భాగాంధీ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదివినా.. ఆమె ఎక్కడైనా ఆటల్లో ముందుండేది. దీంతో ఆమెను కబడ్డీ జాతీయ జట్టుకు కూడా సెలక్ట్ చేశారు. కొన్ని టోర్నమెంట్లలో పాల్గొంది కూడా. కానీ ఆర్థికంగా ఆసరా లేకపోవడంతో ఆమె జీవితంలో స్థిరత్వం కోసం పీఈటీ కోర్సు వైపు మొగ్గు చూపింది. హైదరాబాద్‌లోని ఫిజికల్ ఎడ్యకేషన్ సెంటర్లో ప్రస్తుతం కోర్సు చేస్తోంది. నేషనల్ కబడ్డీ సర్టిఫికెట్ ఉన్నా ఆమెకు సరైన ప్రోత్సాహం కరవై కబడ్డీలో ముందుకు వెళ్లలేకపోయింది.
దీంతో ప్రస్తుతం కోర్సు చేస్తూనే ఇంటి వద్ద అమ్మానాన్నలకు అండగా నిలుస్తోంది. కరోనా వైరస్‌తో సోదరి సహా అందరూ హోం ఐసోలేషన్‌లో ఉండడంతో ఈ సీజన్‌లోని వ్యవసాయ పనులన్నీ రమ్య తానే అయి చేస్తోంది. ఇలా క్రీడల్లో చాటుకున్న పోరాట స్ఫూర్తిని ఆమె నిజ జీవితంలో చూపుతూ పోరాటం చేస్తోంది. కాడెద్దులతో అరక దున్నుతూ పొలాన్ని పైరు వేయడానికి అనువుగా మారుస్తోంది. క్రీడాభిమానులు, ప్రభుత్వం ఇలాంటి క్రీడాకారులకు అండగా నిలిచి, వారిలోని ప్రతిభను వెలికితీయాల్సిన అవసరం ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.