ఇంట్లో ఎవరూ లేనిది చూసి డబ్బు, నగలను కొట్టేసినోళ్లను చూసి ఉంటారు. విలువైన వస్త్రాలను దొంగతనం చేసినోళ్ల గురించి విని ఉంటారు. కోళ్లు, పెంపుడు శునకాలను అపహరించిన వాళ్ల కేసుల గురించి చదివి ఉంటారు. కానీ మొక్కలను కూడా మాయం చేసినోళ్ల గురించి మీరెప్పుడైనా విన్నారా.? అదేంటీ, మొక్కలను దొంగతం చేయడమేంటని అనుకుంటున్నారా.? నమ్మశక్యంగా లేదనుకుంటున్నారా.? కానీ ఇది హైదరాబాద్ నడిబొడ్డున నిజంగా జరిగింది. ఓ ఇద్దరు వ్యక్తులు ఓ మొక్కను దొంగిలించారు. ఇది గమనించిన ఆ యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఊహించనంత వేగంగా ఆ మొక్క దొంగలను పట్టేశారు. కటకటాల్లో పెట్టేశారు. దీనికి సంబంధించిన వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మెక్క మాజీ డీజీపీ అప్పారావు ఇంట్లోది కావడంతో ఇది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది.
రిటైర్డ్ డీజీపీ అప్పారావు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు. ఆయనకు మొక్కల పెంపకం అలవాటు ఉంది. దీంతో దేశ విదేశాల్లోని వివిధ రకాల మొక్కలను తెచ్చి ఇంట్లో పెంచుకుంటున్నారు. ఆయన పెంచుకునే మొక్కల్లో దాదాపు లక్షన్నర రూపాయల విలువైన బోన్సాయ్ మొక్క కూడా ఉంది. రోజూ మొక్కలకు నీళ్లు పోసే తోటమాలి జనవరి 12న బోన్సాయ్ మొక్క మిస్సవడాన్ని గమనించాడు. వెంటనే యజమాని అప్పారావుకు విషయం తెలియజేశాడు. ఈ విషయమై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో మాజీ డీజీపీ అప్పారావు పోలీసు కేసు నమోదు చేశారు. జూబ్లిహిల్స్ పోలీసులు ఆ పరిధిలోని సీసీ కెమెరాలను జల్లెడబట్టి, బోన్సాయ్ మొక్కను దొంగిలించిన ఇద్దరినీ పట్టేశారు. ఆ మొక్కను కూడా వారి నుంచి స్వాధీన పరచుకుని అప్పారావుకు అందించారు. ఇదే విషయమై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
Retd DG Appa Rao special Bonsai which was lost has been traced by Jubilee Hill Detectives @hydcitypolice #Hyderabad pic.twitter.com/ZESFpeYlMo
— Anusha Puppala (@anusha_puppala) January 15, 2021
’పెద్ద పెద్ద కేసుల్లో అయితే నేరగాళ్లు అంత ఈజీగా దొరకరు. కానీ మాజీ డీజీపీ గారి మొక్క విషయంలో మాత్రం వెంటనే దొంగలు దొరికేశారు. మొక్క కూడా దొరికేసింది. సామాన్య ప్రజల విషయంలో కూడా ఇదే రకమైన శ్రద్ధ తీసుకుంటే మంచిది కదా‘ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ‘మాజీ డీజీపీ కాబట్టి మొక్కను కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అదే వేరే వాళ్లయితే పోలీసులు పట్టించుకునేవారు కాదు‘ అని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇలాంటి కేసుల్లో పడి సీరియస్ కేసులను పోలీసులు వదిలేస్తున్నారని, వారి సమయం వృథా అవుతోందని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఏది ఏమైనా ఈ ఘటన విషయమై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుండటం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, CYBER CRIME, Husband kill wife, Theft