Home /News /telangana /

JOB SEEKERS CHEATED IN THE NAME OF JOBS IN KTPS OF TELANGANA FAKE ID CARDS AND DUMMY REGISTERS CREATED AK KMM

Khammam KTPS: నకిలీ ఐడీ కార్డులు,.. డమ్మీ రిజిస్టర్లు.. కేటీపీఎస్‌లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

మోసపోయిన బాధితులు

మోసపోయిన బాధితులు

Khammam KTPS: నిజానికి కేటీపీఎస్‌లో ఎలాంటి ఉద్యోగం పొందాలన్నా నోటిఫికేషన్‌.. రాత పరీక్ష, మౌఖిక పరీక్ష.. అనంతరమే అపాయింట్‌మెంట్‌ ఇచ్చే పరిస్థితి ఉంది. అయినా నిరుద్యోగులు ఆశకు పోయి కాంట్రాక్టరు, మరికొందరు అధికారుల మాటలు నమ్మి మోసపోతున్నారు.

ఇంకా చదవండి ...
  కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(కేటీపీఎస్).. జెన్‌కో పరిధిలో ఉండే ఈ ప్లాంట్‌లో ఉద్యోగమంటే ఎవరైనా ఆశ పడతారు. వారి ఆశనే ఆసరా చేసుకున్నారు కొందరు ప్రబుద్ధులు. దాదాపు అరవై మంది క్యాజువల్‌ లేబర్‌ దగ్గర ఒక్కొక్కరి నుంచి ఒక్కో రకంగా సుమారుగా రెండున్నర కోట్లకు పైగా వసూలు చేశారు. ఇదిగో అదిగో అంటూ ఎన్నాళ్లున్నా ఉద్యోగానికి సంబంధించిన ఆదేశాలు రావడం లేదు. నాలుగేళ్లవుతున్నా ఇంకా ఆశలు రేపుతునే ఉన్నారు తప్ప ఉద్యోగం లేదు. దీంతో డబ్బులు ఇచ్చిన వాళ్లు తిరగబడ్డారు. నిలదీశారు. నేరుగా డబ్బులిచ్చిన వ్యక్తిని నిలదీయడంతో.. ఆ వ్యక్తి మరో వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయనేమో.. తొందరెందుకు.. నేను చూసుకుంటాగా.. అంటూ సెలవిచ్చాడు. అతని మాటలు.. అతని సీటుకున్న పవర్‌ చూసి కొన్నాళ్లు నెమ్మదించారు. అయినా ఫలితం లేదు. ఇక లాభం లేదనుకుని మరోసారి నిలదీశారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. వీళ్లను నియమించుకున్నది కేవలం క్యాజువల్‌ లేబర్‌గా మాత్రమే. అదీ కూడా వివిధ పనుల నిమిత్తం కాంట్రాక్టులు పొందిన వ్యక్తులకు చెందిన సంస్థల్లో మాత్రమే. వారికిచ్చిన ఐడీ కార్డు.. వారికోసం మెయింటెన్‌ చేసిన అటెండెన్స్‌ రిజిస్టర్లు కేవలం కల్పన అని తాజాగా నిర్ధరణ అయింది. దీంతో ఖంగుతిన్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదైంది. మోసంపై సమగ్ర విచారణ సాగుతోంది.

  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. విద్యుత్‌ సరఫరాలో లోపాలు, అంతరాయాలు లేకుండా చేయడానికి ప్రభుత్వం పట్టుదలగా నిర్ణయాలు తీసుకుంది. దీనికోసం అవకాశం ఉన్నచోట కొత్త ప్లాంటులు, మరికొన్ని చోట్ల విస్తరణ పనులు చేపట్టారు. ఇక్కడికి దగ్గరిలో మణుగూరు వద్ద భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ పేరిట కొత్తగా నిర్మాణాలు సాగుతున్నాయి. అదేవిధంగా పాల్వంచలో ఇప్పటికే ఉన్న కేటీపీఎస్‌ ఆరు దశలకు తోడు మరో స్టేజి నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. 2017 నుంచి ఇక్కడ ఏడో దశ ప్లాంట్‌ విస్తరణ పనులు సాగుతున్నాయి. దీనికోసం వివిధ విభాగాలలో పనిచేయడానికి కాంట్రాక్టర్ల వద్ద క్యాజువల్‌ లేబర్‌ పనికి కుదిరారు. అదే సమయంలో ఇక్కడ పనిచేసిన చీఫ్‌ ఇంజినీర్‌ బాదావత్‌ లక్ష్మయ్య.. అప్పటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు సురేష్‌, నాగేంద్ర, ఏఈ మురళీ మనోహర్‌, ఇంకా కాంట్రాక్టర్‌ సత్యనారాయణ, కేటీపీఎస్‌లోనే పనిచేసే సత్యనారాయణ భార్యలు కలసి ఓ పథకం పన్నారు.

  కొన్ని సివిల్‌ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ సత్యనారాయణ వద్ద నిరుద్యోగులు కొందరు పనికి కుదిరారు. కొన్నాళ్లయ్యాక కొత్త ప్లాంట్‌లో తమకు పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇప్పించాలంటూ వారంతా కాంట్రాక్టర్‌ సత్యనారాయణను అభ్యర్థించారు. దీంతో ఆయన భార్య, ఇతర అధికారులు కలసి వారితో ఒక మౌఖిక ఒప్పందం కుదుర్చుకున్నారు. సాక్షాత్తూ చీఫ్‌ ఇంజినీర్‌ వారికి ఉద్యోగం ఖాయమంటూ మాట ఇవ్వడంతో వారు నమ్మారు. దీని ప్రకారం ఉద్యోగాన్ని బట్టి ఒక్కొక్కరు రూ.3 నుంచి 5 లక్షల దాకా చెల్లింపులు చేసేవిధంగా అంగీకారం కుదిరింది. డబ్బులు అందుబాటులో లేని వారి నుంచి చెక్కులు, ప్రామిసరీ నోట్లను కూడా తీసుకున్నారు. నమ్మకం కుదర్చడానికి వారికి ఉద్యోగం ఇస్తున్నట్టు ఆర్డర్‌ కాపీ ఇచ్చారు. ఒక నకిలీ ఐడీ కూడా జారీ చేశారు. ఇలా అరవై మంది నుంచి సుమారు రెండున్నర కోట్లు వసూలు చేశారు.

  ఇలా ఏళ్లు గడిచాయి. కాంట్రాక్టరు ఇస్తున్న క్యాజువల్‌ లేబర్‌ పేమెంట్‌ తప్ప వారికి పైసా అదనంగా ముట్టలేదు. పైగా పర్మనెంట్‌ మాట రాగానే.. సమయం పడుతుంది కదా.. సెవెన్త్‌ ఫేజ్‌ కంప్లీట్‌ కావాలి కదా..? అంటూ నమ్మకం కుదిరేలా కథలు చెబుతూ కాలం వెళ్లబుచ్చారు. తీరా కాంట్రాక్టర్‌ తాను చేపట్టిన పని పూర్తి కాగానే.. అప్పటిదాకా ఇస్తున్న క్యాజువల్‌ లేబర్‌ పేమెంట్లు ఆపేశాడు. మరి తమ ఉద్యోగాల సంగతేంటని ప్రశ్నించడం.. అప్పుడప్పుడు నిలదీయడం జరిగినా ఫలితం లేకపోవడంతో బాధితులంతా తమ గోడును పోలీసులకు వినిపించారు. అయితే వీరికి ఉద్యోగాల విషయంలో నమ్మబలికిన అప్పటి చీఫ్‌ ఇంజినీర్‌ బాదావత్‌ లక్ష్మయ్య మధ్యలో ప్రమోషన్‌ పొందారు.

  ఆయన ప్రస్తుతం జెన్‌కో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతటి పెద్ద స్థాయిలో ఉండి పేదరికంలో ఉన్న నిరుద్యోగులైన తమను మోసం చేయడంపై వారంతా భగ్గుమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. నిజానికి కేటీపీఎస్‌లో ఎలాంటి ఉద్యోగం పొందాలన్నా నోటిఫికేషన్‌.. రాత పరీక్ష, మౌఖిక పరీక్ష.. అనంతరమే అపాయింట్‌మెంట్‌ ఇచ్చే పరిస్థితి ఉంది. అయినా నిరుద్యోగులు ఆశకు పోయి కాంట్రాక్టరు, మరికొందరు అధికారుల మాటలు నమ్మి మోసపోయిన తీరు బాధాకరం. తమను ఎవరికీ చెప్పొద్దని, మళ్లీ తమ పనికి ఇబ్బందవుతుందని సూచించారని బాధితులు వాపోతున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Khammam, Telangana, Unemployment

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు