news18-telugu
Updated: November 26, 2020, 8:24 AM IST
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(ఫైల్ పొటో)
Pawan Kalyan GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించి పోటీ నుంచి తప్పుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే తెలంగాణ బీజేపీ నేతలతో చర్చల అనంతరం పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో.. ఆయన ఢిల్లీ పెద్దలతో తిరుపతి ఉప ఎన్నికల అంశం సహా అనేక అంశాలపై చర్చిస్తారనే వార్తలు వచ్చాయి. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశం అనంతరం... జనసేన దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో అమరావతి, పోలవరం అంశాలపై చర్చించామని.. అమరావతి రైతుల ఆందోళనకు జనసేన-బీజేపీ మద్దతు ఉంటుందని ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఏపీలో అవినీతి విధానాలు, శాంతిభద్రతలు, ఆలయాలపై దాడుల వ్యవహారంపైనా చర్చించామని... పోలవరంపై స్పష్టత ఇవ్వాలని నడ్డాను కోరామని వెల్లడించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు అభ్యర్థిని త్వరలో నిర్ణయిస్తామని.. ఇరు పార్టీల ఉమ్మడి కమిటీ వేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని అన్నారు. ఏ పార్టీ అభ్యర్థి అనేది ఆ సమావేశంలోనే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. అయితే జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో ఏపీకి సంబంధించిన వ్యవహారాల గురించే చర్చించినట్టు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. జేపీ నడ్డాతో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం అంశాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడంతో.. ఆయన గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశాలు దాదాపుగా లేనట్టే అనే టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్‌ను ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా తెలంగాణ బీజేపీ నేతలు కోరినట్టు వార్తలు వచ్చాయి. నగరంలో సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం ద్వారా బీజేపీకి ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపి సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోందనే రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Published by:
Kishore Akkaladevi
First published:
November 26, 2020, 8:24 AM IST