కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ.. బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఇప్పటికీ బీజేపీలోకి రమ్మని సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సాగర్ నుంచి పోటీ చేయమని బీజేపీ నేతలు అడుగుతున్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ను గద్దె దించాలంటే బీజేపీకే సాధ్యమని అన్నారు. అయితే బీజేపీలో చేరే విషయంలో తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తాను గతంలో తిరుపతిలో చెప్పిన మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని జోస్యం చెప్పారు. తాను నాగార్జునసాగర్‌లో బీజేపీ నుంచి పోటీ చేస్తే జానారెడ్డి మూడో స్థానమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చాలాకాలం నుంచి బీజేపీ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అయిష్టంగానే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారని.. సమయం చూసుకుని బీజేపీలోకి వెళతారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి మాట్లాడటంతో పాటు తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కోవడం బీజేేపీకే సాధ్యమంటూ ఆయన గతంలోనే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉంటారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే గతంలో దీనిపై ఆయన స్పందించలేదు.
తాజాగా ఈ అంశంపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నాగార్జునసాగర్‌లో తనను పోటీ చేయాలని బీజేపీ నాయకులు అడుగుతున్న విషయం వాస్తవమే అని అన్నారు. మరికొద్ది రోజుల్లోనే బీజేపీ తమ పార్టీ సాగర్‌లో పోటీ చేయబోయే అభ్యర్థిని ఖరారు చేయనున్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్‌గా తీసుకుని చర్యలు తీసుకుంటుందా లేక ఆయనను లైట్ తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగ మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Jana reddy, Komatireddy rajagopal reddy, Nagarjuna Sagar By-election, Telangana