JANAREDDY HINTS TO CONGRESS HIGH COMMAND REGARDING HIS SON CONTEST IN NAGARJUNA SAGAR BY ELECTIONS AK
Telangana: నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్‌కు గుడ్ న్యూస్..
నాగార్జునసాగర్ ప్రతీకాత్మక చిత్రం
Nagarjuna Sagar By Election: తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. జానారెడ్డి ఫ్యామిలీని పార్టీలో చేర్చుకుని నాగార్జునసాగర్‌లోనూ విజయం సాధించాలని ప్లాన్ చేసినట్టు వార్తలు వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొన్నేళ్లుగా ఏదీ కలిసిరావడం లేదు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో బలహీనపడుతున్న పార్టీని మళ్లీ గాడిలో పెట్టడం ఎలాగో ఆ పార్టీ అధినాయకత్వానికి కూడా అర్ధంకావడం లేదు. పార్టీని బలోపేతం చేయడం ఎలా అనే అంశాన్ని పక్కనపెట్టి.. టీపీసీసీ చీఫ్ పదవి మాకంటే మాకే ఇవ్వాలని నేతలు తెర ముందు, తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు తెలంగాణలో బీజేపీ బలపడుతుంటే.. తమ పార్టీని బలోపేతం చేసుకోవడం ఎలా అనే దానిపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక రాబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఓ అగ్నిపరీక్ష కానుంది. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ తరపున తాను పోటీ చేయబోనన్న పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి... తన కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీలో ఉంటారని స్పష్టం చేశారు.
అయితే రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతారా లేక బీజేపీలో చేరతారా అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే దీనిపై తాజాగా జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగించే విధంగా ఉన్నాయనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తి అయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని అధిష్ఠానానికి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇన్చార్జి కార్యదర్శి బోస్ రాజుకు, హైకమాండ్ పెద్దలకు జానారెడ్డి ఫోన్ చేశారు.
పీసీసీ గొడవ ప్రభావం నాగార్జున సాగర్ ఉపఎన్నికపై పడుతుందని హస్తిన పెద్దలకు జానారెడ్డి తేల్చిచెప్పారని తెలుస్తోంది. ఉప ఎన్నికల ముందు ప్రకటనతో నేతల్లో ఐక్యత లోపిస్తుందని ఆయన అన్నట్టు సమాచారం. జానారెడ్డి సూచనలతో టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ... తన కుమారుడు కాంగ్రెస్ తరపున నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో ఉండాలని నిర్ణయించుకున్నందుకే ఆయన అధిష్టానానికి ఈ సూచనలు చేశారని కొందరు చర్చించుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒకరకంగా సానుకూలమైన అంశమే అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. జానారెడ్డి ఫ్యామిలీని పార్టీలో చేర్చుకుని నాగార్జునసాగర్‌లోనూ విజయం సాధించాలని ప్లాన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన జానారెడ్డి.. కుమారుడి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో సూచనలు చేయడంతో.. నాగార్జునసాగర్ ఉఫ ఎన్నికల బరిలో ఆయన కుమారుడు కాంగ్రెస్ తరపున బరిలో ఉంటారనే సంకేతాలు ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.