టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం కారణంగా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్.. దుబ్బాక తరహాలో ఇక్కడ కూడా సత్తా చాటాలని బీజేపీ అప్పుడే వ్యూహారచన మొదలుపెట్టాయి. ఇక గతంలో తమ సిట్టింగ్ స్థానంగా ఉన్న ఈ సీటును మరోసారి తమ సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డిని ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
అయితే ఇందుకు ఆయన సుముఖంగా లేరనే ప్రచారం జరిగింది. తనకు బదులుగా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దించాలని జానారెడ్డి యోచిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నాగార్జునసాగర్‌లో పోటీ చేసే విషయంలో జానారెడ్డి మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపికను నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు ఆపాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి కావడం, సీనియర్ నేత కావడంతో జానారెడ్డి ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించిందని తెలుస్తోంది.
జానారెడ్డి (ఫైల్ ఫొటో)
ఇదే విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆ ఆదేశాలను పాటిస్తామని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలంతా అంగీకరించినట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ గెలుపు చాలా ముఖ్యమని.. పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో కచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని ఆదేశించినట్టు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ తరపున జానారెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో నిలవడం ఖాయం కావడంతో.. ఇక బీజేపీ, టీఆర్ఎస్లు సైతం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడంపై ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.