(P.Srinivas,New18,Karimnagar)
రాష్ట్రంలో సంచలనం కల్గించిన టీఎస్ పీఎస్సీ(TS PSC) పేపర్ లీకేజీ వ్యవహారంతో ఉమ్మడి కరీంనగర్(Karimnagar)జిల్లాకు లింక్ వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో A2గా జగిత్యాల(Jagityala) జిల్లా,మల్యాల మండలం తాటిపల్లికి చెందిన అట్ల రాజశేఖర్ రెడ్డి (Atla Rajasekhar Reddy)పేరు ఉండడం గ్రామస్థులు షాక్ కు గురయ్యారు. కొంతకాలంగా టీఎస్ పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్న అట్ల రాజేశేఖర్ రెడ్డి భాగస్వామ్యం కూడా ఉందని పోలీసులు తేల్చారు. అయితే ఈ వ్యవహారంలో రాజశేఖర్ డాటాతో పాటు పాస్ వర్డ్ సేకరించి ప్రవీణ్ కు ఇచ్చాడని పోలీసులు చెప్తున్నారు.రాజశేఖర్ రెడ్డి తండ్రి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెల్లి వచ్చి తాటిపల్లిలోనే నివాసం ఉంటున్నారు.
లీకేజ్ కేసులో లింకులు..
అయితే రాజేశేఖర్ కూడా సింగపూర్, ఇరాక్ లలో సిస్టం సెక్యూరిటీకి సంబందించిన సబ్జెక్ట్ లో ట్రైనింగ్ అయ్యాడని తెలుస్తోంది. వివాహం జరిగిన తరువాత ఆయన మామా కూడా విదేశాల్లోనే ఉండడంతో అల్లుడు, కూతురు ఒకే చోట ఉండాలని భావించి ఔట్ సోర్సింగ్ ద్వారా వచ్చే ఉద్యోగంలో స్థిరపడాలని సూచించాడని సమాచారం. దీంతో రాజేశేఖర్ రెడ్డి అప్పటి నుండి టీఎస్ పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి పొందుతున్నాడు. సుమారు 8 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్న ఆయనపై ఇంతవరకు ఎలాంటి ఆరోపణలు రాలేదు. కానీ తాజాగా రాజశేఖర్ పై పేపర్ లీకేజీ కేసు నమోదు కావడం స్థానికంగా కలకలం సృష్టించింది.
గ్రామస్తుల వెర్షన్ ..?
చట్ట వ్యతిరేక కార్యకలాపాలి మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసే రాజశేఖర్ రెడ్డి ఒత్తిళ్ల కారణంగానే తప్పుడు పని చేసి ఉంటాడన్న గ్రామ ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కాబట్టి రెగ్యూలర్ ఎంప్లాయిస్ ఎవరు చెప్పినా తలొంచి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి రాజశేఖర్ ను కావాలనే ఈ క్రిమినల్ చర్యలకు ఉపయోగించుకుని ఉంటారని అంటున్నారు స్థానికులు. అలాగే ఈ కేసులో ఎ1గా ఉన్న ప్రవీణ్ పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో పాటు పోలీసు శాఖకు కూడా సంబంధాలు ఉన్నాయని ఈ కారణంగా రాజేశేఖర్ రెడ్డి భయపడి లీకేజీ వ్యవహారంలో తల దూర్చి ఉంటాడని అంటున్నారు.
ఊరికే చెడ్డ పేరు..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గిస్తున్న ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, రాజశేఖర్ రెడ్డి ప్రమేయం ఎంత మేర ఉందో కూడా అర్థమవుతుందని స్థానికులు చెప్తున్నారు. ఇంటికి ఏకైక వారసుడు అయిన రాజశేఖర్ రెడ్డి కుటుంబం కూడా ఆర్థిక స్థిరపడి ఉందని వ్యవసాయ భూములు కూడా ఉన్నాయని గ్రామస్థులు చెప్తున్నారు.కానీ ఇలాంటి కేసు లో రాజశేఖరరెడ్డి ఉండడం గ్రామానికి మచ్చలాంటిదే అని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Telangana crime news, TSPSC