(శ్రీనివాస్. పి, న్యూస్ 18తెలుగు ప్రతినిధి, కరీంనగర్ జిల్లా
పండగొచ్చిందంటే చాలు చాలా షాపులు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తాయి . కస్టమర్లను రప్పించేందుకు భారీగా డిస్కౌంట్స్ ప్రకటిస్తాయి . బట్టల షాపులు , ఫోన్ల షాపులు , చెప్పల షాపులు.. ఇలా అన్ని దుకాణాలు తెగ ఆఫర్లు కురిపిస్తుంటాయి. ఒకటి కొంటే మరొకటి ఉచితమని ఊరిస్తుంటాయి. ఒక్కటా రెండా... దసరా, దీపావళి వేళ మార్కెట్‌లో ఇలా ఎన్నో రకాల ఆఫర్లు కనిపిస్తుంటాయి. ఐతే జగిత్యాలలో మాత్రం ఓ సరికొత్త ఆఫర్ మాంసం ప్రియులను ఆకట్టుకుంటోంది. అక్కడ మటన్ కొంటే చికెన్ ఫ్రీ..!
జగిత్యాల జిల్లాలో శ్రీశాంత్ మటన్ & చికెన్ సెంటర్ అనే షాప్ ఉంది. ఇటీవలే షాప్‌ను ప్రారంభించారు. జనాలను ఆకర్షించేందుకు ఈ షాపు యజమాని అదిరిపోయే ఆఫర్ ప్రకటించాడు. ఈ దుకాణంలో ఎంత మటన్ తీసుకుంటే.. అందులో సగం చికెన్ ఫ్రీగా ఇస్తారు. అంటే 10 కేజీల మటన్ తీసుకుంటే..5 కేజీల చికెన్ ఉచితం.. ! 5 కేజీల మటన్‌కు 2.5 కేజీల చికెన్ ఫ్రీ... 1 కేజీ మటన్ తీసుకుంటే .. 500 గ్రాముల చికిన్ ఫ్రీగా ఇస్తున్నారు. చివరకు అరకిలో మటన్ తీసుకున్నా.. పావు కిలో కోడి మాంసాన్ని ఉచితంగా పొందవచ్చు. కార్తిక మాసంలో సాధారణంగానే మాంసానికి పెద్దగా డిమాాండ్ ఉండదు. ఇలాంటి సమయాల్లో రేట్లు తగ్గడం, ఆఫర్లు పెట్టడం చూస్తుంటాం. ఐతే ఇదేదో పండగ ఆఫర్ మాత్రమే కాదు. సంవత్సరం మొత్తం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందట.
Nizamabad: మూగబోయిన గొంతు 12ఏళ్ల తరువాత పలికింది.. అద్భతమంటే ఇదే..!
ఒక్క శనివారం , సోమవారం మాత్రమే ఈ షాపుకు సెలవు ఉంటుంది. మిగతా అన్ని రోజులు ఇక్కడ మాంసం లభిస్తుంది. కస్టమర్స్ వాళ్లంతట వాళ్లే రావడానికే ఈ ఆఫర్ పెట్టానని యాజమాని చెబుతున్నాడు. ఈ ఆఫర్ పెట్టిన తర్వాత.. తన షాప్‌కు గిరాకీ పెరిగిందని తెలిపాడు.
గతంలో సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామంలో కూడా ఓ వ్యాపారి ఇలాంటి ఆఫర్‌నే పెట్టాడు. 400 రూపాయలకే మటన్ అమ్ముతున్నారు . 400 రూపాయలకే కిలో మటన్ , బోటి 200 రూపాయలకే కిలో విక్రయిస్తున్నారు . అతి తక్కువ ధరకే మటన్ అమ్ముతున్నారని తెలియడంతో ఆ మటన్ షాపు దగ్గర ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు.మరోవైపు కిలో మటన్ 400 రూపాయలకు విక్రయిస్తున్న షాపు దగ్గర రద్దీతో రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది . వాహనాల పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం , దుకాణం దగ్గర తోపులాట వంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు మటన్ షాపు దగ్గర సెక్యురిటీ ఏర్పాటు చేశారు . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు .
అయితే పక్కనున్న మటన్ షాపు యజమానులు మాత్రం ఇంత తక్కువ ధరకు విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . తమకు బేరాల్లేక బేజారవుతున్నారు . ఇప్పుడు జగిత్యాలలో కూడా ఇలాంటి ఆఫర్స్ పెట్టడంతో అక్కడి మటన్ యజమానులు గుర్రుగా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jagityal, Karimnagar, Telangana