(P.Srinivas,New18,Karimnagar)
సాంకేతిక పరిజ్ఞానం రాకెట్ల దూసుకుపోతున్న ఈ కాలంలో అమాయక ప్రజలను మాయమాటలు నమ్మించి. అందిన కాడికి దోచుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్ళు. తాజాగా అక్షయపాత్ర (Akshayupatra) కొనుగోలు చేసి , ఇంట్లో పెట్టుకుంటే కోటీశ్వరులు అవుతారని గ్రామీణ ప్రాంతాల్లో అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న ముఠాను జగిత్యాల(Jagtial)పట్టణ పోలీసులు పట్టుకున్నారు. మోసగాళ్లను విచారించిన పోలీసులు(Police)ఈ తరహా మోసాలు గతంలో ఎన్నింటికి పాల్పడ్డారు..? వివరాలను బయటపెట్టారు.
అక్షయపాత్ర పేరుతో 10లక్షలు స్వాహా..
మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్లు ఉంటారు. ఎదుటి వాళ్లు చెబుతున్న దాంట్లో ఎంత వాస్తవం ఉందో కూడా ఆలోచించలేని స్థితిలో ఇంకా కొంత మంది ఉన్నారు. అలాంటి వాళ్లను ఆసరాగా చేసుకొని కొందరు మోసగాళ్లు పబ్బం గడుపుకుంటున్నారు. జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్‌కు చెందిన కడప శ్రీనివాస్ జగిత్యాల బీట్ బజార్‌కు చెందిన రాయిల్ల రాయికుమార్ను సంప్రదించాడు . అతను హైదరాబాద్‌కు చెందిన దండె కార్తీక్ , బవికుమార్ , మంచిర్యాలకు చెందిన బోడకుంట మురళీమనోహర్, ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన యాదగిరి అఖిల్కుమార్ను శ్రీనివాస్ వద్దకు తీసుకువచ్చాడు .మహిమ గల అక్షయపాత్ర తమ వద్ద ఉందని , ఇందులో నీరు పోసుకొని ప్రతిరోజూ ఉదయం కుటుంబసభ్యులందరూ తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు.
బకరాల్ని చేసిన గేటుగాళ్లు..
అంతే కాదు ఈ అక్షయపాత్ర వల్ల పాముకాటు వేసినా ఏం కాదని నమ్మించారు . పూజ గదిలో పెట్టి పూజిస్తే కోటీశ్వరులు అవుతారని నమ్మబలికారు. 10 లక్షలు ఇస్తే అక్షయపాత్ర ఇస్తామన్నారు .10లక్షలు ఇచ్చిన శ్రీనివాస్ ఎంతకు డబ్బులు రెట్టింపు కాకపోగా ఆనుమానం వచ్చిన శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జగిత్యాల టౌన్ సీఐ జయేశ్ రెడ్డి , జగిత్యాలరూరల్ సీఐ కృష్ణకుమార్ గురువారం రావుల సాయికుమార్ ఇంటికి వెళ్లారు . అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. ముఠాకు చెందిన మిగతా సభ్యులను సైతం అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
డబ్బు రెట్టింపు కాకపోవడంతో అనుమానం..
సాంకేతిక పరిజ్ఞానం, అరచేతుల్లోకి వచ్చిన టెక్నాలజీ సాయంతో తెలివిగా వ్యవహరించాలి తప్ప ఇలాంటి అసత్య ప్రచారాలు, అబద్ధపు మాటలను నమ్మి మోసపోవద్దంటున్నారు పోలీసులు. ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లుగా ఎవరి దృష్టికైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా లంకె బిందెల పేరుతో మోసగాళ్ల ముఠా జనాన్ని బురిడి కొట్టించి అందిన కాడికి దోచుకొని పోయిందని ..ఇప్పుడు అక్షయపాత్ర, అద్భుత శక్తి కలిగిన యాంత్రిక పని ముట్ల పేరుతో ఎవరు చెప్పినా మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Jagityal, Telangana News