చైతన్యవంతమైన జిల్లాల్లో ఒకటిగా పేరు గాంచిన జగిత్యాల జిల్లా తరుచూ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం అయిందంటే చాలు..ఏదో ఒక విచిత్రమైన పిటిషన్ అధికారులకు ఇస్తుంటారు ఇక్కడి వారు. వినే వారికి సిల్లీగానే ఉన్నప్పటికీ మా బాధలు కూడా పట్టించుకోండని ఇచ్చే దరఖాస్తులు మాత్రం సాధారణంగా మారిపోతున్నాయక్కడ. దీనితో ప్రజావాణి కార్యక్రమంలో ఆ జిల్లా అధికారులు వింత అనుభవాలు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ నుండి సామాన్య ఉద్యోగి వరకు అక్కడికి వస్తున్న వినతి పత్రాలు చూసి పరేషాన్ అవుతున్నారు. అత్యంత విచిత్రంగా వస్తున్న ఆ ఫిర్యాదుల గురించి తరుచూ చర్చల్లోకి వస్తోంది జగిత్యాల జిల్లా.
తాజాగా నిన్న సోమవారం జరిగిన ప్రజావాణికి ఓ మహిళ కత్తితో వచ్చింది. గొల్లపల్లి మండలం రాపల్లికి చెందిన అరుణ జగిత్యాల ఠాకా వీధిలో నివాసముంటుంది. ఉదయం ప్రజావాణికి రాగా మహిళా పోలీసులు ఆమె బ్యాగును పరిశీలించగా కత్తి కనిపించింది. దీంతో మహిళను ఆరుబయట నిలిపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మహిళను వెంట బెట్టుకుని అదనపు కలెక్టర్ వద్దకు తీసుకురాగా తాను సమస్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. తన చనిపోతా లేదంటే ఎవరినైనా చంపుతా అని ఆ మహిళ బెదిరింపులు గురి చేసింది. ఇది గమనించిన అధికారులు ఆమెకు నచ్చజెప్పి పంపించారు.
మొన్నటికి మొన్న జిల్లాలో కింగ్ ఫిషర్ బీర్లు విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సూర్యం అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. అప్పుడు నెట్టింట వైరల్ అయిన ఈ కంప్లైంట్ కాపీ గురించి చాలా మంది మర్చిపోయారు. తిరిగి ఫిబ్రవరి 27న జరిగిన ప్రజావాణిలో కూడా సేమ్ ఇలాంటి పిటిషనే అధికారులకు అందింది. జగిత్యాలకు చెందిన బీరం రాజేష్ అనే వ్యక్తి జిల్లాలోని వైన్ షాపులు, బార్లలో కెఎఫ్ లైట్ బీర్లు అమ్మడం లేదని దీంతో తాము 30 కిలోమీటర్ల దూరానికి వెళ్లి కొనుక్కోవాల్సి వస్తోందని రాజేష్ పిటిషన్ లో పేర్కొన్నాడు. అలాగే గ్రామాల్లోని బెల్టు షాపుల్లో కూడా ఈ బ్రాండ్ బీర్లు అమ్ముతున్నారని అవి నకిలీ బీర్లు అయి ఉంటాయని కూడా ఆరోపించాడు. దీంతో బీర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని జగిత్యాల జిల్లా పేరు మారుమోగింది. అయితే వాస్తవంగా జిల్లాలో సిండికేట్ మాఫియాలా తయారై మార్జిన్ తక్కువగా ఉండే కింగ్ ఫిషర్ బీర్లను విక్రయించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్కువ లాభాలతో పాటు కంపెనీ స్కీంల పేరిట వ్యాపారుల ఆదాయాన్ని ఇవ్వడం లేదన్న కారణంతోనే జిల్లాలో ఎక్కడా కూడా ఈ బ్రాండ్ బీర్ల విక్రయాలకు బ్రేకులు వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐఎంఎల్ డిపోలో సర్కారు అప్రూవల్ చేసిన బ్రాండ్ బీర్లు అందుబాటులో ఉంచుతారని ఇందులో కింగ్ ఫిషర్ బీరు కూడా ఉంటుందని తెలుస్తోంది.
కానీ జగిత్యాల జిల్లాకు చెందిన వ్యాపారులు మాత్రం కింగ్ ఫిషర్ తప్ప మిగతా అన్ని బ్రాండ్ల బీర్లను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వేసవి కాలం రావడంతో మద్యం ప్రియులు ఎక్కువగా బీర్లు తాగేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీంతో తమకు నచ్చిన బీర్లు దొరకకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బీరు ప్రియులు ఈ విధంగా దరఖాస్తులు చేస్తున్నారు. వాస్తవంగా ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం అనుమతించిన ప్రతి బ్రాండ్ ను మార్కెట్లో అందుబాటులో ఉంచాల్సి ఉన్నా పట్టించకోకపోవడం వల్లే ఈ పరిస్థితికి చేరిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే కొడిమ్యాల మండలం నాచుపల్లి హామ్లెట్ విలేజ్ రామారావుపేటకు చెందిన చిట్ల అశోక్ మార్చి 6న చిట్ల రామారావు అనే వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు.
జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషాను కలిసిన ఆయన గ్రామానికి చెందిన 12వ వార్డు మెంబర్ వడ్లకొండ దశరథం వ్యాక్సినేషన్ చేయించకుండా కుక్కను పెంచుకుంటున్నాడని, ఆ శునకం గ్రామస్థులను భయ భ్రాంతులకు గురి చేస్తోందని ఫిర్యాదు చేశారు. కుక్క కారణంగా గ్రామంలోని చిన్న పిల్లలు భయాందోళనకు గురవుతున్నారని, అలాగే ఇంటి ఆవరణలో నాటుకున్న కూరగాయల మొక్కలను కూడా పీకేస్తుందని కూడా అశోక్ రావు ఆరోపించారు. ఈ విషయం గురించి వార్డు మెంబర్ దశరథంను అడిగితే ఎక్కడో చెప్పుకుంటావో చెప్పుకో పో అంటూ బెదిరిస్తున్నాడని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అశోక్ రావు వినతి పత్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇంత చిన్న విషయానికి ఇంత దూరం రావడం అవసరమా...? గ్రామంలో పరిష్కరించుకుంటే బావుండేది కదా అని హితవు పలికారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయితీ అధికారిని తాజాగా ఈ నెల 13న జరిగిన ప్రజావాణిలో అత్యంత విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్నారు జగిత్యాల కలెక్టర్.
ఓ ఐఏఎస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మరో ఐఏఎస్ అధికారికి ఫిర్యాదు చేయడం విచిత్రం. అందునా ఓ గ్రామ సర్పంచ్ ప్రజావాణిలో ఈ ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించిందనే చెప్పాలి. జిల్లాలోని కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట సర్పంచ్ తునికి నర్సయ్య జగిత్యాల పూర్వ కలెక్టర్ రవిపై ఫిర్యాదు చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఒడ్డెర కాలనీ స్కూల్ కంపౌండ్ నిర్మించాలని ఆదేశించారని..150 మీటర్ల మేర ఈ ప్రహరి నిర్మాణం చేసిన వెంటనే డబ్బులు చెల్లిస్తామన్నారని సర్పంచ్ వివరించారు. ఈ కంపౌండ్ వాల్ నిర్మించి చాలా రోజులు అవుతోందని..ఇందుకోసం అప్పులు చేయాల్సి వచ్చిందని సర్పంచ్ నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సకాలంలో బిల్లులు రాకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందని తనకు నిధులు ఇప్పించాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.