తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన ప్రకటన వారిలో కొత్త ఆశలు రేకెత్తించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50వేల పోస్టులను భర్తీ చేయాలని అధికారులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆదేశించిన విషయం తెలిసిందే. కేసీఆర్ చేసిన ప్రకటనపై ఇప్పుడు రాజకీయ రచ్చ జరుగుతోంది. కేసీఆర్ మాటలను నమ్మవద్దని.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కొత్త డ్రామాకు తెరదీశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కేసీఆర్ ఉచ్చులో పడి మళ్లీ మోసపోవద్దని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత విజయశాంతి కూడా ఉద్యోగ నియామకాలపై స్పందించారు. తెలంగాణలో 50వేల ఉద్యోగాల భర్తీకి అవకాశమే లేదని ఆమె స్పష్టం చేశారు.
అటు దుబ్బాకలోను, ఇటు జీహెచ్ఎంసీలో బీజేపీ దూకుడు దెబ్బకు కేసీఆర్ దొరగారికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారు. ఉద్యోగార్థులను ఆరేళ్ళుగా పూచికపుల్లలా తీసిపడేసిన సీఎం గారు ఆదరాబాదరాగా 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ పొలికేక పెట్టారు. మన ఉద్యోగాలు మనకు.. మన నీళ్ళు మనకు అంటూ ఎప్పుడో ఉద్యమకాలంలో నినదించి, అధికారపగ్గాలు అందుకోగానే ఆ విషయం మర్చిపోయారు. బీజేపీ విజయాలు కేసీఆర్ గారికి దడపుట్టించి నిరుద్యోగులు జ్ఞాపకానికి వచ్చారు.ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండేళ్ళుగా జోనల్ సిస్టంను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీచర్ల ఏకీకృత సర్వీసు అంశంలో కేంద్రహోంశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేదు. రెండు జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది.
సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరమన్న విజయశాంతి.. ఇవిగాక మరెన్నో చిక్కులు దీనితో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఇవేమీ తేలకుండా కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదని స్పష్టం చేశారు. నిరుద్యోగులను మరోసారి ధోకా చేసే సీఎం కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలు... రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సాగవని విమర్శించారు విజయశాంతి.
త్వరలోనే రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న అనేక ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉపాధ్యాయ, పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య ఎంత అనే అంశంపై త్వరలోనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను ఇటీవలే సీఎం కేసీఆర్ ఆదేశించారు. వీటితో పాటు వివిధ శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టులపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అన్నారు. అధికారుల నుంచి నివేదిక వచ్చిన తరువాత త్వరలోనే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:December 16, 2020, 08:22 IST