కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి మద్దతుగా మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సైతం జైలుకు వెళ్లేందుకే సిద్ధపడుతున్నట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ ఎంపీలు కూడా మూకమ్మడిగా రాజీనామా చేసే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తోంది. ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఎంపీలు అదే ఆలోచనలో ఉన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి... రాజీనామా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసే యోచనలో ఉన్నారని సమాచారం. అదే జరిగితే తెలంగాణలో రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు రానున్నాయి.
రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఇక కోమటి రెడ్డి వెంకటరెడ్డి భువనగిరి నుంచి ఎంపీగా గెలిచారు. వీరిద్దరు రాజీనామా చేస్తే.. ఆయా స్థానలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ కూడా మాట్లాడారు. అటు కోమటిరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మా ఎంపీ పదవుల్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. సోనియా ఖర్గే ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. కేంద్రం పెద్ద తప్పు చేసిందన్నారు కోమటిరెడ్డి. రాహుల్ గాంధీ రెండు సార్లు కూడా ప్రధాని అయ్యే అవకాశం వదులుకున్నారన్నారు. ఆదానీ గుట్టు బయటపెడతారనే రాహుల్ పై వేటు వేశారన్నారు.
మరోవైపు రాహుల్ గాంధీపై వేటుకు నిరసనగా... హైదరాబాద్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తిక చర్చ జరిగింది. కొత్త పార్లమెంట్ భవనం ఎప్పుడు ప్రారంభం అవుతుందని రేవంత్.. ఉత్తమ్‌ను ప్రశ్నించారు. అయితే ఉత్తమ్ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అయ్యేసరికి మనం సభ్యులుగా ఉంటామో లేదో అన్నారు ఉత్తమ్. రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలన్నారు. మరోవైపు త్వరలో సూరత్ లేదా ఢిల్లీలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించనున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.