ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కథ ముగిసినట్లేనా... కారు దూసుకుపోతుందా...

Lok Sabha Elections 2019 : రాజకీయ పరిస్థితులకు తోడు... అభ్యర్థుల పని తీరు కూడా టీఆర్ఎస్‌కి కలిసొస్తుందా?

Krishna Kumar N | news18-telugu
Updated: April 9, 2019, 11:46 AM IST
ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కథ ముగిసినట్లేనా... కారు దూసుకుపోతుందా...
ఉత్తమ్ కుమార్, రాహుల్ గాంధీ
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని భావించి... తీరా అంచనాలకు తగ్గ విధంగా ఫలితాలు రాకపోవడంతో డీలా పడిపోయిన కాంగ్రెస్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో పుంజుకోవడం ద్వారా... తిరిగి లోక్ సభ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. హస్తం చాలా ప్రమాదకరమనీ, అది భస్మాసుర హస్తం అని విమర్శలు సాగిస్తున్న టీఆర్ఎస్... ఛాన్స్ దొరికితే, కాంగ్రెస్ నేతలను తమ పార్టీలో కలిపేసుకుంటోంది. ఆ విషయంలో మాత్రం హస్తం ఆ పార్టీకి నేస్తంగానే కనిపిస్తోందనుకోవచ్చు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికల విషయానికి వస్తే... టీఆర్ఎస్ 17 ఎంపీ స్థానాలనూ (వాటిలో 1 మిత్రపక్షం MIMకి) గెలుచుకొని తెలంగాణ నుంచీ కాంగ్రెస్‌కి ప్రాతినిధ్యమే లేకుండా చెయ్యాలని చూస్తోంది. తద్వారా భవిష్యత్తులో తమకు పోటీగా ఏ పార్టీ కూడా లేదనే సంకేతాలిచ్చేందుకు భారీ వ్యూహంతో ముందుకెళ్తోంది.

అధికార పార్టీ ఇన్ని రకాల లెక్కలు వేసుకుంటూ ప్రచారంలో దుమ్మురేపుతున్నప్పుడు... ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ దాన్ని తలదన్నే రేంజ్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ప్రచారం సాగించాలి. అలాగైతేనే గెలుపు సాధ్యమన్నది ప్రతి ఒక్కరూ ఒప్పుకునే మాట. కానీ ఉత్తర తెలంగాణను గమనిస్తే.... అక్కడ అసలు కాంగ్రెస్ పోటీ చేస్తోందా అన్న డౌట్ వస్తోందట ఆ పార్టీ నేతలకే. ఉత్తర తెలంగాణలో పెద్దపల్లి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జహీరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ కలిపి... మొత్తం 8 లోక్ సభ స్థానాలున్నాయి. వీటిలో ఒకట్రెండు స్థానాలు తప్పితే... కాంగ్రెస్ నుంచీ బలమైన అభ్యర్థులు లేరన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో కూడా హస్తం అభ్యర్థులు చురుగ్గా లేరనీ... అసలు గెలుస్తామన్న ధీమా వారిలో కనిపించట్లేదన్నది విశ్లేషకుల మాట. ఉదాహరణకు మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్... తనకు కాంగ్రెస్ పెద్దలెవరూ సహకరించట్లేదని ఈమధ్యే బాంబు పేల్చారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆ పార్టీలో ఐక్యత కొరవడిందనేందుకు నిదర్శనం అంటున్నారు టీఆర్ఎస్ నేతలు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఉత్తర తెలంగాణపై పెద్దగా దృష్టి సారించలేదు. అందుకు తగ్గట్టుగానే అప్పట్లో కాంగ్రెస్‌కి ఉత్తర తెలంగాణ దాదాపు దూరమైంది. ఇప్పుడు కూడా ఇంచుమించు అదే పరిస్థితి కనిపిస్తోంది. దక్షిణాదిన మాత్రమే ఎక్కువ ఫోకస్ పెడుతుండటంతో... ఉత్తరాది హస్తం అభ్యర్థుల్లో మానసిక స్థైర్యం తగ్గిపోయిందనీ... ఎన్నికలకు ముందే చాప చుట్టేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్ నేతలు మాత్రం టీఆర్ఎస్‌పై ఇంతెత్తున లేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా తమ నేతలను లాగేసుకోవడమే కాక... తమను మానసికంగా దెబ్బతియ్యాలని గులాబీ నేతలు యత్నిస్తున్నారనీ... లోక్ సభ ఎన్నికల్లో గెలిచి... కారు జోరుకు మరోసారి బ్రేకులు వేసి తీరతామని అంటున్నారు. 16 స్థానాలపై కన్నేసిన కేసీఆర్ కల ఎప్పటికీ తీరదనీ... తెలంగాణలో కాంగ్రెస్‌ని పూర్తిగా మట్టుపెట్టడం ఎవరితరమూ కాదని అంటున్నారు. గురువారమే ఎన్నికలు... మరి ప్రజలు కారుకే సలాం కొడతారో, హస్తమే అభయహస్తం అనుకుంటారో వారికే తెలియాలి. 

ఇవి కూడా చదవండి :

అమిత్ షా కష్టం మామూలుది కాదు.. ఆయనలా మరెవరూ కష్టపడలేరు : మోదీటీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్న సీట్లు ఇవే... పోటాపోటీ

కేసీఆర్‌ను చంద్రబాబు భయపెడుతున్నారా... భయపడుతున్నారా... విజయసాయి రెడ్డి ఏమన్నారంటే...
First published: April 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు