( జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా)
..ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలీడం చాలా అవసరం. ఇదేదో సినిమా డైలాగ్ అయినప్పటికీ.. తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌కు సరిగ్గా నప్పుతుందన్నది పరిశీలకుల మాట. తాను అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా చూడ్డానికి సీఎం కేసీఆర్ ఎంత వరకైనా వెళతారు.. అవసరమైనప్పుడు ఒక మెట్టు అయినా దిగడానికి ఏమాత్రం బేషజాలకు పోరన్నది నిజం. బహుశా ఆయనలోని ఆ ప్రత్యేకతే దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరేలా చేసిండొచ్చు. ఉద్యమ కాలంలోనైనా.. తిరుగులేని అధికారం సొంతమై సర్వాధికారాలు చేతిలో ఉన్నా రాజకీయాల్లో సైతం ఆయన తన వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతునే ఉంటారంటారు. బహుశా అందులో భాగంగానే వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే తెలంగాణలో పీకే (ప్రశాంత్‌కిషోర్) టీం మకాం వేసి నేతల భవితవ్యం ఏంటన్న దానిపై థరో సర్వే రిపోర్టులు సిద్ధం చేస్తుండగా.. సీఎం కేసీఆర్ సైతం తన వ్యూహాల్లో తాను నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి గత అనుభవాలను పునరావృతం కాకుండా ఉండేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటి నుంచే ప్రతి నేతను టచ్‌లోకి తీసుకుంటూ పార్టీ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూసుకుంటున్నారు అనిపిస్తోంది. దీనిలో భాగంగానే అన్నట్టుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి గత కొద్దిరోజుల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
గత వారాంతంలో రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆర్థిక, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రభుత్వపరమైన ఆతిథ్యం స్థానంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన బేతుపల్లి గంగారం సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో విడిది చేశారు. గతంలో తనకు క్యాబినెట్ సహచరుడు, దీనికి మించి తనకు సన్నిహితుడైన హరీష్‌రావు జిల్లాకు వస్తున్నారన్న విషయం తెలియగానే మాజీ మంత్రి తుమ్మల తన ఇంటికి ఆహ్వానించారు. రోజంతా ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న హరీష్‌రావు ఆ సాయంత్రం తుమ్మలతో ఆయన వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. తెల్లారి ఉదయాన్నే తుమ్మలకు చెందిన ఆయిల్ పాం తోటలో ఇద్దరూ కలియ తిరిగారు. ఆయిల్‌పాం సాగుకు సంబంధించిన వివరాలను హరీష్‌రావు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా వీరితో తుమ్మల తనయుడు యుగంధర్ కూడా ఉన్నారు. ఇంకా తన నియోజకవర్గం పాలేరులో కీలకమైన నేతలు సాధు రమేష్‌రెడ్డి ఇంకా ఇతరులను హరీష్‌రావుకు పరిచయం చేశారు. జిల్లాతో పాటు, రాష్ట్రంలో సమకాలీన రాజకీయ స్థితిగతులపై ఇరువురూ చర్చించారు.
Murder : పెళ్లింట విషాదం... పెళ్లి కోసం వచ్చిన మేనమామపై గొడ్డలితో దాడి చేసి చంపిన తండ్రి...
ఇదంతా సరే.. అసలు తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌కు సమాచారం లేకుండానే మంత్రి హరీష్‌రావు ఒక మాజీ మంత్రిని కలవగలరా..? ఏదో మర్యాదకు కలసి కాసేపు పలకరించడం వేరు.. దాదాపు పర్యటనలో సగభాగం ఒక మాజీ మంత్రితో గడపడం జరుగుతుందా..? ఇదే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశమైన విషయం. సీఎం కేసీఆర్ తాజాగా క్షేత్రంపై దృష్టిసారించారా..? అంటే అవునంటున్నారు తెరాసలోని పైస్థాయి వర్గాలు. దీనిలో భాగంగానే ట్రబుల్‌షూటర్‌గా పేరున్న హరీష్‌రావును మాజీ మంత్రి తుమ్మలను కలవాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మలకు ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ తనకంటూ మనుషులున్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైనప్పటికీ, తెరాసకు అధికారం దాఖలు పడినప్పటికీ.. సీఎంగా కేసీఆర్‌కు ఖమ్మం జిల్లాలో పట్టుదొరికింది మాత్రం తన చిరకాల స్నేహితుడు తుమ్మలను క్యాబినెట్‌లో చేర్చుకున్నాకనే అన్నది చరిత్ర. ఫలితంగానే ప్రాజెక్టుల రీఇంజినీరింగ్ మొదలు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం సహా, అనే రహదారులను నేషనల్ హైవేలుగా మార్చుకోగలిగారు. నిజానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు నడుస్తున్న అనేక అభివృద్ధి పథకాలు అప్పట్లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు చొరవతో మొదలైనవే.
సామాజికవర్గం తోడుగా..
Peddapally : విషాదం..కడుపులో ఓ బిడ్డ, పక్కన మరో బిడ్డతో కలిసి ఏం చేసిందంటే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కమ్మ సామాజికవర్గానికి రాజకీయ, వాణిజ్య, వ్యాపార రంగాలతో పాటు దాదాపు అన్ని రకాలుగా పట్టున్న ప్రాంతంగా ఖమ్మం జిల్లాకు పేరుంది. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లోని సెటిలర్స్ ఉన్న నియోజకవర్గాలతో పాటు, కమ్మ సామాజికవర్గానికి ఖమ్మం జిల్లా కేరాఫ్‌గా మారిందని చెప్పొచ్చు. ఆ సామాజికవర్గానికి ఐకానిక్ పర్సనాలిటీగా గుర్తింపు ఉండి, ఇతరత్రా అందరితోనూ సన్నిహితంగా ఉంటారని పేరున్న తుమ్మలకు సహజంగానే రాజకీయావకాశం లభించింది. ఒకవైపు అభివృద్ధికి మారుపేరుగా నిలవడం.. మరోవైపు రాజకీయ, వ్యాపార, వాణిజ్య, సినిమా, పత్రిక, మీడియా సహా ఆధ్యాత్మిక రంగాల్లోని ప్రముఖులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు తుమ్మల రాజకీయ భవిష్యత్తుకు, ప్రత్యేక రాష్ట్రంలో తన ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయడానికి దోహదం చేశాయని చెప్పొచ్చు. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, ప్రత్యేక రాష్ట్రంలో తన మార్కు చూపించారంటారు. అనూహ్య పరిణామాల్లో పాలేరులో ఓటమి ఆయన్ను కుంగదీసినా, క్యాబినెట్‌కు దూరంగా ఉన్నా.. ఇప్పటికీ తుమ్మల పేరు ఓ బ్రాండ్‌గానే ఉండిపోయింది. ఒకవేళ రాష్ట్రంలో ఏవైనా అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటే తమకు అవకాశం వచ్చేలా చూడండంటూ ఇప్పటికీ తనను కలసే ఎమ్మెల్యేల సంఖ్య తక్కువేమీ లేదు. పైగా తన సామాజికవర్గానికే చెందిన అరికెపూడి గాంధీ, కోనేరు కోనప్ప, భాస్కరరావులు కొద్దిరోజుల క్రితం తుమ్మలను కలిసి ఈమేరకు చర్చలు జరిపారు.
Medak : ఎమ్మెల్యే భర్త.. అక్రమాలకు తెర.. కోర్టు జోక్యంతో చర్యలు.. పదవులకు ఫుల్‌స్టాప్.
ఖమ్మంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీరంతా మర్యాదపూర్వకంగానే మాజీ మంత్రిని కలిసినప్పటికీ, ఎప్పటికప్పుడు స్పీడుగా మారుతున్న రాజకీయాల్లో అవకాశాలను సజీవంగా ఉంచుకోడానికే కలిశారంటున్నారు. అయితే సమీప భవిష్యత్‌లో తెరాస మినహా వేరే పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితి కనిపించడం లేదని వీరి మధ్య చర్చ జరిగిందని చెబుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచి మినహా,వేరే మార్గంలో తనకు ఎలాంటి అవకాశాలు అవసరం లేదంటూ చెప్పుకొస్తున్న తుమ్మల తీరుపైనా ఆయన సన్నిహితులు, అనుచరవర్గంలో నిరసన ధ్వనులు వినిపిస్తుంటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి ఊపిరులూది కుమ్ములాటలో బలైపోయిన తమ నేతకు అధినేత తగిన స్థాయిలో అక్కున చేర్చులేదన్న ఆగ్రహం సైతం ఉంది. బహుశా ఇలాంటి ఒత్తిళ్లకు ఎక్కడ తుమ్మల తలొగ్గుతారోనన్న బెరకుతోనే తెరాస అధినేత, సీఎం కేసీఆర్ మంత్రి హరీష్‌రావును పురమాయించినట్టు చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.