Khammam : పాలేరు తెరాసలో వర్గపోరు.. వర్గాలుగా చీలిపోయిన పార్టీ నేతలు...కార్యకర్తలు..

Khammam : పాలేరు తెరాసలో వర్గపోరు..

Khammam : పాలేరు తెరాసలో వర్గపోరు మొదలైంది. ఒకవైపు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి దూకుడుగా వెళ్తుంటే.. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనదైన శైలిలో రాజకీయాలు నెరపుతున్నారు.

 • Share this:
  ఖమ్మంలో వర్గపోరు కొనసాగుతోంది..గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి తుమ్మలపై గెలిచిన కందాళ ఆతర్వాత తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి తన వెంట వచ్చిన కాంగ్రెస్‌, తెరాస కార్యకర్తలు, మండల, గ్రామ స్థాయి నాయకులకు అండగా ఉంటున్నారు. అయితే అప్పటికే అక్కడ స్థిరపడిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విశ్వసనీయంగా ఉన్న మండల, గ్రామ స్థాయి నాయకులపై లేనిపోని కేసులు పెట్టిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు తరచూ వస్తున్నాయి. తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ముక్కోటి వృక్షార్చన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే తో పాటుగా తుమ్మల వర్గానికి చెందిన కొందరి ఫోటోలను ముద్రించారన్న కారణంగా, వాటిని కత్తిరించిన వ్యక్తిపై ఎమ్మెల్యే కేసు పెట్టించారంటూ సోమవారం కూసుమంచి పోలీసుస్టేషన్‌ ఎదుట తుమ్మల వర్గం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. దీంతో అధికార పార్టీలో ఇద్దరు ప్రధాన నేతల మధ్య ఉప్పునిప్పుగా ఉండడంతో పోలీసులకు సహజంగానే తలనొప్పిగా మారింది.

  2018 డిసెంబరులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెరాస తరపున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నుంచి కందాళ ఉపేందర్‌రెడ్డి బరిలో నిలిచారు. హోరాహోరీగా జరిగిన పోరులో కందాళ ఉపేందర్‌రెడ్డి గెలుపొందారు. నిజానికి మూడు దశాబ్దాల పాటు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో తుమ్మల తన ముద్ర వేసుకున్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తిచేయడం, రోడ్లను అభివృద్ధి చేయడం లాంటి వాటితో తుమ్మల మార్కు అభివృద్ధి కనిపించింది.

  అయితే అభివృద్ధిలో దూకుడును ప్రదర్శించిన తుమ్మల ప్రజా సంబంధాల విషయంలో, దిగువశ్రేణి నేతల మధ్య ఉన్న తగాదాలను తీర్చడంలో నిర్లక్ష్యం వహించడంతో అదే ఆయనకు నష్టంగా మారింది. దీంతో పాటు 2009 నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలన్న ఆలోచనతో ఉన్న కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రజలతో విస్త్రుతమైన సంబధాలు నెరపడం, నిత్యం అందుబాటులో ఉండడం, ఛారిటీ లాంటి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. దీంతో ఆ ఎన్నికల్లో తుమ్మలపై కందాళ గెలుపొందారు. గెలుపొందిన కొద్ది వారాలకే కందాళ నేరుగా కేటీఆర్‌ను కలసి తెరాస తీర్ధం పుచ్చుకున్నారు. ఆ సందర్భంలో తన నియోజకవర్గ విషయాల్లో ఎవరి జోక్యాన్ని సహించనని స్పష్టం చేసినట్టు చెబుతారు. ఈమేరకు కేటీఆర్‌ సైతం కందాళకు హామీ ఇచ్చారన్నది ఆయన వర్గీయుల మాట.

  అనంతరం జరిగిన అన్ని లోకల్‌బాడీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే కందాళ తనకు నమ్మకస్తులైన వారికే పార్టీ పదవులు, ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తూ వచ్చారు. ఇది సహజంగానే తుమ్మల వర్గానికి చెందిన వారికి కంటగింపుగా మారింది. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ తుమ్మల పాలేరులో తన వర్గానికి నిత్యం అందుబాటులో ఉంటూ వచ్చారు. తరచూ పర్యటనలు, పలకరింపులూ చేస్తూ వస్తున్నారు. దీంతో తుమ్మలకు అప్పట్లో దగ్గరైన నాయకులంతా అంతే వర్గంగా ఉండడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు ఇది తలనొప్పిగా మారింది. దాదాపు ప్రతి వారం తుమ్మల పాలేరులో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటుండడంతో ఇది రోజురోజుకూ పరాకాష్టకు చేరింది.

  పైపెచ్చు వచ్చే ఎన్నికల్లో తాను బరిలో నిలవడం ఖాయమని తుమ్మల తానే చెబుతుండడంతో ఇది ఇంకా ముదురుతూ వస్తోంది. దీనికితోడు తుమ్మల వర్గానికి చెందిన మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్‌ రమేష్‌పైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం, తాజాగా ఫ్లెక్సీని కట్‌చేశారన్న కారణంతో మరొకరిపై కేసు నమోదు చేయడంతో ఇది ముదిరిపాకాన పడింది. ఇరువర్గాలు ఎవరికివాళ్లే మంకుపట్టు పట్టి పరస్పరం కేసులు పెట్టుకోవడంతో ఇది పోలీసులకు తలనొప్పిగా మారింది. దీనికితోడు ఈ వర్గపోరును తెరాస అధిష్టానం పెద్దగా సీరియస్‌గా తీసుకున్న దాఖలాలేదు. పైపెచ్చు పాలేరులో అసలు ప్రతిపక్షం ఆనవాళ్లు కనిపించకపోగా, అధికార తెరాసలోనే ఒక వర్గం అధికారపార్టీగానూ, మరోవర్గం ప్రతిపక్షంగానూ వ్యవహరిస్తూ వస్తుండడం ఇక్కడ కొసమెరుపు. మరి ఇది ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందోనన్న కలవరం పార్టీ అభిమానుల్లో కనిపిస్తోంది.
  Published by:yveerash yveerash
  First published: