Peddapally bjp Disputes : బిజెపిలో అప్పుడే అసమ్మతి సెగలు.. పాత, కొత్త నేతల మధ్య వివాదాలు

ప్రతీకాత్మక చిత్రం (బిజెపిలో అప్పుడే అసమ్మతి సెగలు.. పాత, కొత్త నేతల మధ్య వివాదాలు

Peddapally bjp : పెద్దపల్లి జిల్లా బిజెపిలో అప్పడే అసమ్మతి సెగలు రేగుతున్నాయి. జిల్లాలోని పాత కొత్త నేతల మధ్య సయోధ్య కుదరకపోవడమే ఈ అసమ్మతికి కారణం.. ముఖ్యంగా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ ఎంపీ వివేక్‌‌ ఇతరనేతల మధ్య రాజకీయ వైరం నెలకొంది.

  • Share this:
పెద్దపల్లి జిల్లా..
తేదీ న్యూస్ 18. తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి.

పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నేత డాక్టర్‌ గడ్డం వివేక్‌ తీరుపై ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు రుసరుసలాడుతున్నారు. తమ నియోజకవర్గాల్లో తమతో సంబంధం లేకుండానే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటి నుంచో లోలోన కుమిలిపోతున్న నేతలు ఒక్కటై, ఆయనకు వ్యతికేకంగా జట్టుక డుతున్నారు. ఆయన తీరు మారుతుందని వేచిచూసిన సదరు నేతలు మార్పేమి లేదని భావించి పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకోసం కార్యచరణ సైతం నిర్ణయించారు.. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని ఒక నాయకుడి ఇంటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల నుంచి పోటీచేసిన నేతలతో పాటు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు.

వివేక్‌ పార్టీలో చేరిన నాటి నుంచి తమకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయిందని, ఆయన ఒంటెద్దు పోకడలకు పోతుండడం వల్లనే పార్టీ భవిష్యత్తు దెబ్బతింటున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రయోజనాలు, బలోపేతం దృష్ట్యా పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజవర్గంలో వివేక్‌ పార్టీ నేతలను కాదని అనుసరిస్తున్న వ్యతిరేక విధానాల గురించి లాక్‌ డౌన్‌ తర్వాత అధిష్టానం దృష్టికి తీసుకపోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

గడిచిన పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్న మాజీ ఎంపీ వివేక్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ టిక్కెట్‌ తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు సహాయపడ్డారంటూ పార్టీ అధిష్టానానికి టీఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ అధినేత కేసీఆర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్‌ను నిరాకరించి ఊహించని షాక్‌ ఇచ్చింది. అనూహ్యంగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన బోర్లకుంట వెంకటేశ్‌ నేతకు టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లోనే బీజేపీ తనకు టిక్కెట్‌ ఆఫర్‌ చేసినప్పటికీ ఆయన పోటీ చేయలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు.

ఆయనతో పాటు ఆయన అనుచరులు బీజేపీలో చేరినప్పటికీ, బీజేపీ నేతలతో ఆయన పెద్దగా సంబంధాలను కొనసాగించకపోవడం, తమను కాదని పలు కార్యక్రమాలను నిర్వహించడం, ఇతర పార్టీలకు చెందిన వారిని తమకు తెలియకుండానే పార్టీలోకి తీసుకరావడంతో తమకు వ్యతిరేకంగా తనకంటూ ఒక గ్రూపును ఏర్పాటు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, మంథని, ధర్మపురి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన నేతలతో పాటు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కూడా వివేక్‌ తీరు పట్ల గుర్రుగానే ఉన్నారు. వివేక్‌ బీజేపీలోకి రావడాన్ని వ్యతిరేకించని సదరు నేతలు తమను కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటూ తమను అవమానపరుస్తున్నాడనే భావనలో ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులను బీజేపీలో చేర్పించడంలో చొరవ చూపుతున్నప్పటికీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న తీరుతో ఆయన పట్ల వారికి వ్యతిరేకత పెరిగినట్లయ్యింది.

గత నెలలో పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక నాయకుడు వివేక్‌ ఆధ్వర్యంలో బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోగా, ఆ పార్టీకి చెందిన సీనియర్‌ బీజేపీ నేతలు తమకు తెలియకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారని అధిష్టానం వద్ద అడ్డుపడడంతో ఆయన చేరికకు బ్రేకులు పడ్డాయి. ఏళ్ల తరబడి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ జెండా మోస్తూ వస్తున్న తమను కాదని ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని బీజేపీకి చెందిన ఒక నాయకుడు వ్యాఖ్యానించాడు. వివేక్‌ పార్టీలో చేరడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, తామేమి పార్లమెంట్‌ టిక్కెట్‌ కావాలని ఆయనకు పోటీగా వెళ్లడం లేదని, పార్టీ నియమాలకు విరుద్ధంగా పని చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని ఒక నేత అన్నారు.

ఈటల రాజేందర్‌ను బిజేపి పార్టీలో చేరేందుకు క్రియశీల పాత్ర పోషించిన వివేక్, సొంత జిల్లా నాయకులతో ఒక్క మాట కూడ చెప్పలేదని కూడ వారు వివేక్ పై గుర్రుగా ఉన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా సమావేశం కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత సదరు నాయకులు పార్టీ అధిష్టానానికి వివేక్‌ తీరుపై ఫిర్యాదు చేయనున్నారని తెలిసింది. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్న బీజేపీ కార్యకర్తలను పెద్దపల్లి పార్లమెంట్‌నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కలవరపెడుతున్నాయి. ఈ పరిణామాలు ఎటు వైపు దారి తీస్తాయో వేచిచూడాల్సిందే..
Published by:yveerash yveerash
First published: