హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఆ ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హత్యకు మావోయిస్టులు స్కెచ్..! తెలంగాణలో కలకలం

Telangana: ఆ ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హత్యకు మావోయిస్టులు స్కెచ్..! తెలంగాణలో కలకలం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: ఎమ్మెల్యేలపై దాడి ప్రయత్నాన్ని మావోయిస్టులు విరమించుకున్నప్పటికీ.. ఏదోరకంగా అలజడి రేపవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే అనుమానితులపై నిఘా పెట్టి..అడవులను కూడా జల్లెడ పడుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో మావోయిస్టుల (Maoists in Telangana) కదలికలు మళ్లీ పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని గోదావరి తీరంలో మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు, నిఘావర్గాలు గుర్తించారు. తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను మావోయిస్టులను టార్గెట్‌ చేసుకున్నట్లుగా పసిగట్టారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల (TRS MLAs)ను హతమార్చేందుకు స్కెచ్ వేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (Durgam Chinnaiah), చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman), రామగుండం కోరుకంటి చందర్‌(Korukanti Chandar) ను హతమార్చేందుకు మావోయిస్టులు రెక్కీ కూడా నిర్వహించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకోసం మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యనేతలు కూడా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. కానీ ఎలాంటి హింసకు పాల్పడలేదు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు మహారాష్ట్ర  (Maharashtra) సరిహద్దులో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలపై దాడి చేశాక.. నిమిషాల్లోనే ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి పారిపోయేందుకు వీలుంది. కానీ రామగుండం మైదాన ప్రాంతం కావడంతో.. అక్కడ ఎలాంటి హింసకు పాల్పడినా.. పోలీసులకు వెంటనే దొరికిపోతారు. ఈ క్రమంలోనే మొదట చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలను మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంలో వారి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. ఇద్దరూ దళిత ఎమ్మెల్యేలు కావడంతో.. వారిపై దాడి జరిగితే.. మావోయిస్టుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశముంది. అందువల్లే వారిద్దరిపై దాడి ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. మొత్తంగా ముగ్గురి హత్యు రెక్కీ నిర్వహించినప్పటికీ.. సామాజిక కోణాలు, భౌగోళికంగా ప్రతికూల పరిస్థితులను పరిగణలోకి తీసుకొని.. నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ ధర్మన్న తెలంగాణలోకి ప్రవేశించారని నిఘావర్గాలకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సరిహద్దులో నిఘాను పెంచారు. గోదావరి చుట్టుపక్కల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోనూ పోస్టర్లు వేసి.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ , మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి.. ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, గోదావరిఖని పారిశ్రామికవాడల్లో పనిచేస్తున్న వలస కూలీల్లో.. మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిపైనా నిఘా ఉంచారు.

ఎమ్మెల్యేలపై దాడి ప్రయత్నాన్ని మావోయిస్టులు విరమించుకున్నప్పటికీ.. ఏదోరకంగా అలజడి రేపవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్యోగాల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో.. కనీసం ఒక్కరినైనా హత్య చేయాలని మావోయిస్టులు భావిస్తున్నారట. టైమ్ బాంబుతో వారిపై దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టైమ్‌బాంబు పెట్టి తర్వాత.. అది పేలే లోగా అక్కడ నుంచి తప్పించుకోవచ్చన్నది వారి వ్యూహం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రామగుండంలో అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచారు.

First published:

Tags: Maoists, Telangana, Telangana Politics