(K.Lenin,News18,Adilabad)adb
వర్షాకాలంలో ఎక్కడైనా భారీ వర్షాలు కురుస్తుంటే పెంకుటిళ్లు, గుడిసెలు, రేకుల ఇళ్లలో ఉండేవాళ్లు ఇంటి పైకప్పుపై పెద్ద ప్లాస్టిక్ కవర్‌ను కప్పి ఉంచడం చూస్తాం. వర్షం కారణంగా పడే నీరు ఇంట్లోకి రాకుండా చూసుకుంటారు. కాని ఆనకట్ట(Dam)ను కాపాడుకోవడానికి ఏకంగా పాలిథిన్ కవర్(Polylithine cover)ను కవచంగా ఏర్పాటు చేసిన ఘటన కొమురంభీం ఆసిఫాబాద్(Komurambhim Asifabad) జిల్లాలో వెలుగుచూసింది. ఇది చూసిన జనం ఆనకట్టకు పాలిథిన్ కవర్ కప్పడమేమిటని ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.
డ్యామ్ సేఫ్టీ కోసం కవర్..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురంభీం ప్రాజెక్టుకు ముంపు పొంచి ఉంది. ఇటీవల ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తడంతొ ఆనకట్ట చివరి భాగంలో రాళ్ళు, మట్టి కొట్టుకుపోయి బలహీనపడుతోంది. నీటి తాకిడికి నెమ్మదిగా ఆనకట్ట కూలుతోంది. అయితే ఆనకట్టను పటిష్టం చేసి కాపాడుకోవాల్సి ఉండగా, నిధుల లేమితో ఆనకట్ట పొడువునా వరద తాకిడిని తట్టుకునేలా ఓ భారీ పాలిథిన్ కవర్లను కప్పి ఉంచారు. ప్రస్తుతం పాలిథిన్ కవర్లే ఆ ఆనకట్టకు రక్షణ కవచంగా మారింది.
ఇలాగైతే ఎలా ..
మరోవైపు ఈ కొమురంభీం ప్రాజెక్టుతో పాటు వట్టి వాగు ప్రాజెక్టు బిల్లులు కట్టని కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. త్రిఫేజ్ విద్యుత్ సరఫరాను పునరద్దరించకపోవడంతో వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టు గేట్లను పైకి ఎత్తడానికి, కిందకు దించడానికి జనరేటర్ ను వినియోగిస్తున్నారు. ఒకవేళ భారీ వర్షం కురవడంతో పాటు వరద ఉధృతి పెరిగి జనరేటర్ మొరాయిస్తే ప్రాజెక్టు తెగిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో 10 టిఎంసిల నీటి సామర్థ్యంతో పదేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును నిర్మించారు. నిధుల లేక కాల్వల నిర్మాణం పూర్తికాలేదు. గత కొన్నేళ్ల నుండి ప్రాజెక్టు నిర్వాహణ అస్తవ్యస్థంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్టులోకి వరద నీరు ఎంత వస్తుంది, ఎంత బయటకు పోతోందో కూడా లెక్కగట్టలేని పరిస్థితి నెలకొందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
శాశ్వత పరిష్కారం ఏది..?
జిల్లాలోని కొమురం భీం, వట్టి వాగు ప్రాజెక్టుల భారీగా వరద చేరితే గేట్లు ఎత్తడానికి గతంలో ఇచ్చిన త్రీఫేస్ కరెంటును పునరుద్ధరించాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు కూలుతున్న అనకట్టకు ఫాలిథిన్ కవర్‌ను రక్షణ కవచంగా కాకుండా శాశ్వతంగా మరమ్మత్తు చేయాలని సూచిస్తున్నారు. మొన్నటి వర్షాలు, వరదలకు కడెం ప్రాజెక్టు అనుభవంతోనైనా ప్రభుత్వం ఈ కొమురంభీం ప్రాజెక్టు నిర్వహణ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిర్లక్ష్యo చేస్తే ఆనకట్టలు తెగి లోతట్టు ప్రాంతాల ప్రజలకు శాపంగా మారే అవకాశo ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల గోడు పాలకులు, అధికారయంత్రాంగం సీరియస్‌గా తీసుకొని శాశ్వత పరిష్కారం కనిపెడతారో లేక సిల్లీగా కొట్టిపారేస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asifabad, Project, Telangana News