Home /News /telangana /

INDUSTRIALISTS AND REALTORS OCCUPYING NIZAM DECCAN SUGAR FACTORY LANDS MS NZB

Nizam Sugar Factory: రియల్టర్ల చేతిలోకి నిజాం షుగర్స్ భూములు.. అటకెక్కిన కేసీఆర్ హామీ..

నిజాం షుగర్ ఫ్యాక్టరీ (ఫైల్)

నిజాం షుగర్ ఫ్యాక్టరీ (ఫైల్)

Nizam Sugar Factory: నిజామాబాద్ జిల్లాలోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ భూములు ఇప్పుడు పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళాయి. ఫ్యాక్టరీకి సంబంధించిన మొత్తం పదహారు వేల ఎకరాలకు గాను.. ప్రస్తుతం పదహారు వందల ఎకరాలు కూడా కనిపించని దుస్థితి ఏర్పడింది.

ఇంకా చదవండి ...
 • News18
 • Last Updated :
  అదొక చారిత్రాత్మకమైన ఫ్యాక్టరీ. ఆసియాలోనే రెండో అతిపెద్ద ఫ్యాక్టరీగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజలకు అదొక కల్ప తరువు. కానీ కాల క్రమేణ ప్రభుత్వం దాని భారాన్ని మోయనంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో ఆ భూమిపై రియల్టర్లు, పారిశ్రామికవేత్తల కన్ను పడింది. ఇంకేం దానిని అందినకాడికి దోచుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ భూములు ఇప్పుడు పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళాయి. ఫ్యాక్టరీకి సంబంధించిన మొత్తం పదహారు వేల ఎకరాలకు గాను.. ప్రస్తుతం పదహారు వందల ఎకరాలు కూడా కనిపించని దుస్థితి ఏర్పడింది. చరిత్రాత్మకమైన ఈ ఫ్యాక్టరీ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుని అమ్మకానికి పెడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ అక్రమార్కులకు అధికారుల అండదండలుండడంతో ఆక్రమణల గుట్టు బయటకు రావడం లేదు.

  బోధన్ సమీపంలో గల నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. ప్యాక్ట‌రీ నిర్వహణతో పాటు ప్యాక్ట‌రీకి సంబంధించిన వందలాది ఎకరాల భూములు కూడా ఇతర వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళాయి. 1937లో ఏర్పడిన ఈ ఫ్యాక్టరీ ఆసియాలోనే రెండో అతి పెద్ద చక్కెర కర్మాగారంగా గుర్తింపు పొందింది. దశాబ్దాల పాటు తన ప్రస్థానాన్ని కొనసాగించింది. కాలక్రమంలో నిర్వహణ భారమై ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. విడతల వారీగా ఈ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాయి. అప్పట్లోనే దీని పరిధిలోని 16,000 ఎకరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేదలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి ఒక్కో ఎకరా ఇచ్చి, అందులో చెరకు పండించాలని భావించారు. ఆ పంటతో ఫ్యాక్టరీని నడిపించుకోవాలని సూచించారు.

  రియల్టర్ల రంగ ప్రవేశంతో...

  ఈ మేరకు బోధన్, కోటగిరి, వర్ని, రెంజల్, ఎడపల్లి, నవీపేట మండలాల్లో పది వేల ఎకరాలకు పైగా పంపిణీ చేశారు. అప్పట్లో భూములను సాగు చేసే స్థోమత లేక కొందరు.. పరిస్థితులు అనుకూలించక‌ మరికొందరు వాటిని పడావుగా వదిలేశారు.
  అయితే కాలక్రమంలో భూముల ధరలు పెరగడం, రియల్టర్లు రంగ ప్రవేశం చేయడంతో ఈ ఫ్యాక్టరీ భూములు తెరపైకి వచ్చాయి. ఒక్కో రైతు వద్ద ఉన్న ఎకరా చొప్పున భూమిని టోకుగా సొంతం చేసుకునేందుకు బడా వ్యాపారులు రంగంలోకి దిగారు. రాజకీయ అండదండలతో రైతులను చేరదీసి అమ్మకానికి తెచ్చారు. అయితే గత అయిదేళ్ళుగా ఈ భూములకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది.  పెరిగిన డిమాండ్.. 

  మొదట్లో ఎకరం ధ‌ర‌ లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు పలుకగా... ఇటీవల అది రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పెరిగింది. దీంతో బోధన్ పట్టణ పరిసరాల్లో, కోటగిరి, రెంజల్, ఎడపల్లి మండలాల్లో ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రధాన రహదారుల పక్కనున్న భూములను కొందరు పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు పోటీ పడి మరీ కొంటున్నారు. ఈ డిమాండ్ ను గమనించిన రైతులు కొందరు స్వయంగా తమ భూములను అమ్మకానికి పెడుతున్నారు. కేవలం ఫ్యాక్టరీ భూముల లావాదేవీలు చూసుకునేందుకు ప్రత్యేకంగా దళారులు పుట్టుకొచ్చారు. రైతుల వద్ద రాతపూర్వక అనుమతులు తీసుకోవడం మొదలు, ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయించే వరకు వారు బాధ్యత తీసుకుంటున్నారు.

  నిజాం షుగర్ ఫ్యాక్టరీ..


  అధికారుల అండదండలు...

  ఇలాంటి ఆక్రమిత భూముల్లో ఈ పాటికే భారీ భవనాలు, పరిశ్రమలు ఆవిర్భవించాయి. కొందరు ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. వీరికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖాధికారుల అండదండలున్నాయి. ప్రతీ పనికి పర్సెంటేజీలు తీసుకుంటూ ఫ్యాక్టరీ భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడ్తున్నారు. దళారులు తమను మోసం చేసి భూములు తీసుకుంటున్నారని, తమకు వేలల్లో ఇచ్చి వారు కోట్లలో లబ్ది పొందుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  అటకెక్కిన సీఎం కేసీఆర్ హామీ...

  తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని స్థానికులు గుర్తు చేస్తున్నారు. కనీసం ఫ్యాక్టరీని ప్రభుత్వం టేకోవర్ చేసుకోక పోగా, ఉన్న చారిత్రాత్మక కట్టడాన్ని, దానికి సంబంధించిన భూములను కూడా కాపాడలేక పోతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి చరిత్రాత్మకమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములు కాపాడాలని, తద్వారా ఫ్యాక్టరీని వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Bodhan, Nizamabad, Sugar, Telangana, Telangana News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు