హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mallareddy: మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు.. ఇప్పటి వరకు రూ.8.80 కోట్లు స్వాధీనం

Mallareddy: మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు.. ఇప్పటి వరకు రూ.8.80 కోట్లు స్వాధీనం

మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి

Mallareddy: మల్లారెడ్డికి 38 ఇంజనీరింగ్‌ కాలేజీలు, నాలుగు మెడికల్‌ కాలేజీలతో పాటు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. వాటి కొనుగోళ్లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఆస్తులపై ఐటీ దాడులు (Income Tax Raids)  తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్నాయి. నిన్నటి నుంచి ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి నివాసం, ఆయన బంధువుల ఇళ్లు, మల్లారెడ్డి కాలేజీలు, ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాలకు సంబంధించి ఐటీ శాఖ అధికారులు బుధవారం సాయంత్రం కీలక వివరాలను వెల్లడించారు.  ఇప్పటి వరకు 8.80 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాల ద్వారా తెలిసింది. మంగళవారం జరిపిన సోదాల్లో రూ.4.80 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.  త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2.80 కోట్లు, మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, మల్లారెడ్డి బావమరిది కొడుకు సంతోష్‌రెడ్డి ఇంట్లో రూ.4 కోట్లు సీజ్ చేశారు. బుధవారం మల్లారెడ్డి కోడలు, కూతురిని  బ్యాంక్‌కు తీసుకెళ్లారు. బాలానగర్ క్రాంతి బ్యాంక్‌లో లాకర్‌ను అధికారులు ఓపెన్ చేయించారు.

మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై నిన్న ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని ఆదాయ పన్ను శాఖ అధికారులతో పాటు ఒడిశా , కర్నాటక నుంచి కూడా అధికారులు వచ్చారు. 400 మందికి పైగా సిబ్బంది..65 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డికి చెందిన 14 విద్యాసంస్థలతో పాటు ఆస్పత్రుల లావాదేవీలను పరిశీలించారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించామని ఐటీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ రాయితీతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యా సంస్థల్లో.. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే.. అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును.. నగదు రూపంలో తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లెక్కచూపని ఆ డబ్బును స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

స్థిరాస్తుల విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు తెలిపారు. స్థిరాస్తుల వాస్తవ ధరను కాకుండా... తక్కువగా చూపినట్లు పేర్కొన్నారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధమాన్ కాలేజీలో డైరెక్టర్‌గా ఉండడంతో.. అక్కడ కూడా సోదాలు చేసినట్లు సమాచారం. మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఇవాళ రాత్రికి ముగుస్తాయని, మరికొన్ని చోట్ల రేపు కూడా కొనసాగుతాయని ఐటీ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, మల్లారెడ్డికి 38 ఇంజనీరింగ్‌ కాలేజీలు, నాలుగు మెడికల్‌ కాలేజీలతో పాటు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. వాటి కొనుగోళ్లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఐటీ దాడులను మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను టీఆర్ఎస్ మంత్రిని అయినందువల్లే కక్షగట్టారని ఆరోపిస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. అన్ని అనుమతులతోనే కాలేజీలు నిర్వహిస్తున్నామని.. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. తను అధికారులకు సహకరిస్తున్నానని.. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

First published:

Tags: Income tax, Mallareddy, Telangana, Trs

ఉత్తమ కథలు