Home /News /telangana /

IN HIS NATIONAL AGENDA SPEECH AT TRS PLENARY CM KCR DID NOT DIRECTLY CRITICIZE BJP IS IT PK STRATEGY MKS

KCR | TRS plenary: ఒక్కసారి కూడా బీజేపీ పేరెత్తని కేసీఆర్.. కారు గేరు మారిందా? పీకే వ్యూహమా?

కేసీఆర్, పీకే

కేసీఆర్, పీకే

ప్రత్యర్థులపై ఎదురుదాడి, పదునైన తిట్ల దండకంతో విరుచుకుపడే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తన సహజ శైలికి భిన్నంగా కనీసం ప్రత్యర్థి పేరు ప్రస్తావించకుండా ప్లీనరీలో మాట్లాడటం చర్చనీయాంశమైంది.

ప్రత్యర్థులను చీల్చి చెండాడటంలో కేసీఆర్ ను మించిన మాటకారి లేరని జాతీయ స్థాయిలోనూ పేరుంది. మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ, ఎంచుకున్న టార్గెట్ పై దాడి చేయడంలో తాను నిపుణుణ్నని కేసీఆర్ ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నారు. కానీ ఇప్పుడు కారు పార్టీ అధినేత ఇప్పుడు గేరు మార్చినట్లు కనిపిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రాన్ని మరింత పరుషంగా తిడుతూ వచ్చిన కేసీఆర్.. ఇవాళ్టి టీఆర్ఎస్ ప్లీనరీలో మాత్రం ఒక్కటంటే ఒక్కసారి కూడా బీజేపీ పేరెత్తలేదు.

గంటకుపైగా సాగిన ప్రారంభ ఉపన్యాసంలో కేసీఆర్ దేశం దుస్థితిని ఆవిష్కరించి, స్థూలంగా వైఫల్యాలను చెప్పుకొచ్చారేగానీ, నేరుగా బీజేపీనిగానీ, కాంగ్రెస్ ను గానీ, ప్రధాని మోదీ పేరును గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. దేశంలో అలా జరుగుతోంది, పొరుగు రాష్ట్రాల్లో ఇలా జరుగుతోంది అంటూ అన్నీ పరోక్ష విమర్శలే చేశారు. కేసీఆర్ వాణిలో ఇంతటి మార్పునకు కారణం ప్రశాంత్ కిషోర్ వ్యూహాలేనని తెలుస్తోంది. ప్లీనరీ ప్రత్యేక వేదిక కాబట్టి అక్కడ కేసీఆర్ సంయమనం పాటించారనుకోడానికీ వీల్లేదు ఎందుకంటే, ఇతర తీర్మానాలపై మాట్లాడిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇంకొందరు మంత్రులు మాత్రం బీజేపీని గట్టిగానే అరుసుకున్నారు. తద్వారా ప్రత్యర్థలపై విమర్శల విషయంలో స్పష్టమైన స్థాయి తేడా ఉండాలన్న సూచన అమలవుతోన్నట్లు అవగతం అవుతోంది.

KCR | TRS plenary: కేసీఆర్ సంచలనం.. జాతీయ అజెండా ప్రకటన.. భారత రాష్ట్ర సమితి (BRS)!


తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు.. మోదీ-బీజేపీపై కేసీఆర్ యుద్ద ప్రకటన.. పార్టీ బలాబలాపై విస్తృతస్థాయి సర్వేలు.. ప్రశాంత్ కిషోర్ రంగ ప్రవేశం.. కేంద్రంతో యుద్దం.. అధికార విపక్షాల మధ్య తీవ్ర విమర్శల హోరు.. తదితర అంశాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బుధవారం నిర్వహించిన ప్లీనరీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అందరూ ఊహించినట్లుగానే కేసీఆర్ తన జాతీయ అజెండాను ప్రకటించారు. ఫలానా పార్టీకి ప్రత్యాత్యామ్నాయంగా ఫ్రంట్ నిర్మాణం.. కొందరు సీఎంలతో కూటమి కట్టడం.. ఫలానా వ్యక్తిని ప్రధాని పదవి నుంచి దించేయడం.. లాంటివి తమ లక్ష్యం కాదని, దేశం గరిమను పెంపొందించే.. గతిని మార్చేసే అజెండా రూపకల్పనే ధ్యేయమని కేసీఆర్ చెప్పారు. ఇవి కేసీఆర్ తరచూ చేసే రాజకీయ విమర్శలకు పూర్తి భిన్నం. బీజేపీని బంగాళాఖాతంలో కలపడమే తన ధ్యేయమని, దేశానికి మోదీ రూపంలో పట్టిన పీడ విరగడ కావాల్సిందేనని మొన్నటిదాకా వాదించిన కేసీఆర్ ఇప్పుడు సడెన్ గా భాషను మార్చేసి.. భావానికి ప్రధాన్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది.

KCR | TRS plenary: బీజేపీ-మోదీపై కేసీఆర్ 13 బాణాలు -ప్లీనరీలో అన్నీ సంచలన తీర్మానాలు


నిజానికి ఇవాళ్టి టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్.. కేంద్రంపై ఎన్నిరకాల విమర్శలు చేయాలో అంతకంటే ఎక్కువే తిట్టిపోశారు. బీజేపీ, కాంగ్రెస్ లను ఏవైతే అనాలనుకున్నారో పొల్లు పోకుండా అనేశారు. ప్లీనరీలో చేసిన 13కు 13 తీర్మానాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తూ బీజేపీని ఇరుకున పెట్టేవే. కానీ కేసీఆర్ స్పీచ్ లో మాత్రం ఎ క్కడా మోదీ పేరుగానీ, బీజేపీ, కాంగ్రెస్ ప్రస్తావనగానీ లేకుండా జాగ్రత్తపడ్డారు. దేశంలో ఇప్పటికీ మోస్ట్ పాపులర్ నేతగా ఉన్న మోదీని తిట్టడం వల్ల ప్రత్యర్థులకు నష్టమేగానీ లాభం ఉండదని ప్రశాంత్ కిషోర్ సూచించడం వల్లే కేసీఆర్ వ్యక్తులపై విమర్శలను కంట్రోల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Revanth | PK : రేవంత్ బ్రో.. పీకేతో ప్రెస్‌మీట్ ఎప్పుడు బ్రో? -తలకిందులైన టీకాంగ్రెస్ అంచనాలు!


టీబీజేపీ చీఫ్ బండి సంజయ్, స్థానిక నేతలపై దూషణలకు సైతం వెనుకాడని కేసీఆర్ ఇవాళ మాత్రం అసలు తన ప్రత్యర్థులెవరో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయలేదు. బీజేపీ బేసిగ్గా వివాదాలు సృష్టించి లబ్దిపొందాలనుకునే పార్టీ కాబట్టి వాళ్లను విమర్శించడం పూర్తిగా మానేసి, వైఫల్యాలను మాత్రమే ఎత్తిచూపుతూ, బీజేపీ విధానాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, మనమేం చేయగలమో ప్రజలకు వివరిస్తే సరిపోతుందన్న పీకే ఐడియాను కేసీఆర్ ఇవాళ్టి ప్రసంగంలో అడుగడుగునా పాటించారు. మరోవైపు,

KCR | TRS plenary: కేసీఆర్ జాతీయ పార్టీ.. నేటి ప్లీనరీలో ప్రకటన.. పీకే ద్వారా చక్రంతిప్పేలా!


పీకే సూచనల మేరకే కేసీఆర్ ప్రత్యర్థులపై దూకుడు ధోరణి మార్చుకున్నప్పటికీ రాజకీయాలు పండాలంటే కచ్చితంగా ఒక ఎమోషనల్ పాయింట్ అవసరం కాబట్టి.. 8ఏళ్లు అధికారంలో ఉండి మళ్లీ తెలంగాణవాదం పేరుతో ఓట్లు అడగలేరు కాబట్టి వ్యూహకర్తల సలహాలు, స్వీయ అనుభవాలతో కేసీఆర్ ప్రత్యామ్నాయ జాతీయ అజెండాను తెరపైకి తెచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక అంశంపై కేసీఆర్ ఇవాళ మాట్లాడిన మాటలన్నీ గత కొంతకాలంగా పీకే పలు ఇటర్వ్యూల్లో చెబుతూ వస్తున్నవే కావడం గమనార్హం.

Prashant Kishor | Congress: సారీ మేడం.. నేను కాంగ్రెస్‌లో చేరట్లేదు: సోనియాకు భారీ షాకిచ్చిన పీకే


వ్యక్తిగతంగా పీకే.. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాగలదని నమ్మడం, అందులో చేరేందుకు విఫలయత్నం చేయడం, అంతకు ముందు మమతా బెనర్జీ టీఎంసీని జాతీయ పార్టీగా విస్తరించాలనే ప్రయత్నంలోనూ దెబ్బతినడం వేరే అంశాలు. ఫలితమివ్వని ప్రతిసారి ఐడియాలను మార్చుకుంటూ పోవడం పీకేకు అలవాటనే వాదన ఉండగా.. కేసీఆర్ మొన్నటిదాకా బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల ఐక్యతను ఆకాంక్షించి.. ఇప్పుడు సడన్ గా పార్టీల ప్రస్తావన లేని ప్రత్యామ్నాయ అజెండా వైపునకు మళ్లడాన్ని పీకే మార్కు సేఫ్ గేమ్ అనే విశ్లేషణలు వస్తున్నాయి.

CM KCR : ఆ క్యాన్సర్‌ మనదగ్గర తెచ్చుకోవద్దు.. 3టిమ్స్ ఆస్పత్రుల భూమిపూజలో కేసీఆర్ అనూహ్య వ్యాఖ్యలు


కేసీఆర్ ను బీజేపీ వ్యతిరేకిగా గుర్తించడానికి దేశంలోని పార్టీలేవీ సిద్ధంగా లేకపోవడం, పలు అంశాల్లో విపక్షాల ఉమ్మడి ప్రకటనల్లోనూ కేసీఆర్ పేరును చేర్చకపోవడం లాంటి వ్యతిరేక పరిణామాల నడుమ కేసీఆర్ ఒక విస్తృత స్థాయి అజెండాను.. అది కూడా పార్టీల ప్రస్తావన లేని అజెండాను ఎంచుకోవడమే సేఫ్ గేమ్ అనే భావన వ్యక్తమవుతోంది. మరి పీకే చెప్పినట్లు పార్టీలను తిట్టకుండా అజెండాల పేరుతో కేసీఆర్ తన సహజ నైజాన్ని మార్చుకుంటే అది టీఆర్ఎస్ కు లాభిస్తుందా? కారు గేరు మార్పు ప్రమాదానికి దారి తీస్తుందా లేక సాఫీగా గమ్యానికి చేరుతారా? అనేది తేలాల్సిఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Hyderabad, Prashant kishor, Telangana, Trs

తదుపరి వార్తలు