తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. అప్పుడు టీఎస్ ఐపాస్.. ఇప్పుడు బీపాస్

మంత్రి కేటీఆర్ ఫైల్ ఫోటో

ఇప్పటికే 87 మునిసిపాలిటీల్లో టిఎస్ బీపాస్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని, ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల నుంచి వస్తున్న దరఖాస్తులను పరిశీలన జరుపుతున్నట్లు చెప్పారు.

 • Share this:
  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం టీఎస్ బీపాస్‌ను ప్రభుత్వం జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానుంది. అందులో భాగంగానే టీఎస్ బీపాస్‌పై మంత్రి కే.తారకరామారావు బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని ఏసీ గార్డ్స్‌లోని మునిసిపల్ కాంప్లెక్స్‌లో జరిగిన సమావేశంలో పురపాలక శాఖ అధికారులు, జిహెచ్ఎంసి, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి మంత్రి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికే 87 మునిసిపాలిటీల్లో టిఎస్ బీపాస్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని, ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల నుంచి వస్తున్న దరఖాస్తులను పరిశీలన జరుపుతున్నట్లు చెప్పారు. కొన్నింటికి ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్‌కు పురపాలక శాఖ అధికారులు తెలిపారు.

  ఇప్పటిదాకా ప్రయోగాత్మకంగా సుమారు 1100 దరఖాస్తులు టిఎస్ బి పాస్ ద్వారా వచ్చాయని అధికారులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికలు పూర్తిస్థాయిలో ఈ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన టీఎస్ బీపాస్ వ్యవస్థలో భాగస్వాములైన సిబ్బందికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలతో పాటు హైదరాబాద్‌లోనూ ఈ వ్యవస్థను ఏకకాలంలో ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులకు ప్రత్యేకంగా సూచించారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లోనే జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా కలెక్టర్లు రెవెన్యూ యంత్రాంగం టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నత అధికారులను ఆదేశించారు.

  పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్‌లైన్‌లోనే అనుమతులు పొందేందుకు వీలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం మీసేవ సెంటర్లతో పాటు పౌర సేవా కేంద్రాలు, వ్యక్తిగతంగా ఇంటర్నెట్ ద్వారా కానీ, మొబైల్ యాప్ ద్వారా గాని, ఇవేవి అందుబాటులో లేకుంటే నేరుగా కానీ అప్లికేషన్లు పెట్టుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. దీంతో పాటు పౌరులు ఎవరైనా దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటే అధికారులను సంప్రదించి అందుకు ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉండే ఇటువంటి వ్యవస్థను తయారు చేయాలని సూచించారు.

  ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్ పైన సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మరింత సులభతరం చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని ఈ సమావేశంలో మంత్రి అధికారులకు సూచించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సిడిఎం ఏ సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
  Published by:Narsimha Badhini
  First published: