హైదరాబాద్ నగర మున్సిపాలిటీ పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు.. గత పది రోజులుగా అనుమతులు లేని నిర్మాణాలపై నజర్ వేసి వాటిని కూల్చివేస్తున్నారు.. ఇలా ఇప్పటివరకు 101 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ బృందాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే గురువారం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక అపార్ట్ మెంట్ లో ఉన్న రెండు బ్లాక్ లపై అక్రమ అంతస్తుల నిర్మాణాలపై డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండిఎ యంత్రాంగం కూల్చి వేసింది.
నిజాం పేట్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 92/పి లో ఒక యజమాని తనకు ఉన్న 840 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్ + 2 అంతస్తుల భవనానికి అనుమతి తీసుకుని మూడు(3) బ్లాక్ లను స్లిట్ +5 అప్పర్ ఫ్లోర్స్ నిర్మాణాలు కట్టారు. దానిపై గురువారం టాస్క్ ఫోర్స్ టీమ్ చర్యలు తీసుకుంది.గత కొన్ని రోజులుగా హెచ్ఎండీఏ, టాస్క్ ఫోర్స్ టీమ్స్ పలు మున్సిపాలిటీల పరిధిలో ని 600 చదరపు గజాలు పైబడిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, మరికొన్నింటిని సీజ్ చేయడం జరిగింది.
దీంతో ఇప్పటివరకు హెచ్ఎండీఏ టాస్క్ ఫోర్స్ టీమ్స్ 101 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.. ఇందులో 78 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా మరో 23 అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీలలో పనిచేస్తున్న సిబ్బంది కోవిడ్ కారణంగా విధులకు దూరంగా ఉన్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ చర్యలకు కొంత అంతరాయం జరుగుతుందని అధికారులు తెలిపారు. అక్రమ కట్టడాలు నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.