I WILL GIVE BACK MY PADMA SRI AWARD KINNERA MOGULAIAH ARTIST STRUGGLING BETWEEN TRS AND BJP SK
Mogulaiah: ఇటు బీజేపీ.. అటు టీఆర్ఎస్.. మొగులయ్యపై రాజకీయం.. నా కడుపు కొట్టొద్దని ఆవేదన
మొగులయ్య
Mogulaiah: 12 మెట్ల కిన్నెర కళాకారుడు రాజకీయాల్లో చిక్కుకున్నారు. ఆయన పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయాలు చేయడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. ఈ క్రమంలో... తాను పేద వాడినని.. కడుపు కొట్టవద్దని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
దర్శనం మొగులయ్య (Darshanam Mogilaiah). తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి బాగా తెలిసిన వ్యక్తి. 12 మెట్ల కిన్నెర సంగీతమే ఊపిరిగా బతుకుతున్న కళాకారుడు. మరుగునపడిన కళను నేటి తరానికి పంచుతున్న గాయకుడు. ఈయన తపనను, కళను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఆర్థికంగా చేయూతనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. సినిమాల్లోనూ పాటలు పాడే స్థాయికి ఆయన ఎదిగారు. ఇంత వరకు బాగానే ఉంది. మొగులయ్యకు న్యాయం జరిగిందని.. పేద కళాకారుడికి మంచి గుర్తింపు వచ్చిందని.. అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు సిసలు రాజకీయాలు మొదలయ్యాయి. వాటి మధ్య చిక్కుకొని ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాల్లోకి లాగి.. తన కడుపు కొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తన నోట్లో మట్టికొడితే పాపం తగులుతుందని విమర్శించారు.
అసలేమైందంటే..?
కిన్నెర్ర మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత ఆయన్ను సీఎం కేసీఆర్ (CM KCR) ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయనకు కోటి రూపాయల నజరానా ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఐతే కేసీఆర్ ఆ ప్రకటన చేసి చాలా రోజులయింది. మరి చెప్పినట్లుగా.. ఆర్థిక సాయం చేశారా? అని బీజేపీ నేతలు ఆరా తీశారు. ఇటీవల ఓ బీజేపీ నేత కారులో వెళ్తుండగా.. మొగులయ్య ఆపారు. ఇబ్బందులో ఉన్నానని.. ఆర్థిక చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 'కేసీఆర్ కోటి రూపాయలు ఇవ్వలేదా?' సదరు నేత ప్రశ్నించారు. ఇంకా ఇవ్వలేదని మొగులయ్య సమాధానం చెప్పారు. అంతేకాదు ఇటీవలే బండి సంజయ్‌ని కలిశానని..చాలా గుణవంతుడని మెచ్చుకున్నారు. అంతే ఆ మాటలను సదరు వ్యక్తి రికార్డుచేసి.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
— Teenmar Mallanna (@TeenmarMallanna) May 18, 2022
ఆ వీడియోను వైరల్ చేస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ''కేసీఆర్ హామీ ఇస్తే.. అంతే.. అవి రావు.'' అంటూ సెటైర్లు వేస్తున్నారు. చివరకు మొగులయ్యను కూడా మోసం చేశారా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మొగులయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ కోసం టీఆర్ఎస్ ఇంత చేస్తే.. మీరు బండి సంజయ్‌ని పొగొడుతారా? అని గుర్రుగా ఉన్నారు. మధ్యలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మీకు భీమ్లా నాయక్ వల్లే ఇంత గుర్తింపు వచ్చిందని.. ఆయన డబ్బులు కూడా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. పవన్ చేసిన సాయాన్ని మర్చిపోయావంటూ కొందరు విమర్శిస్తున్నారు.
ఈ పరిణామాలను చూసి మొగులయ్య బాధపడ్డారు. తన వీడియోను వైరల్ చేసిన నాయకుడిని అచ్చంపేటలో రోడ్డుపైనే నిలదీశారు. అనంతరం విడుదల చేసిన వీడియో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తనకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని.. కోటీ రూపాయలను కూడా త్వరలోనే ఇస్తారని చెప్పారు. తనకు పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రమే ఇచ్చిందని ఓ పార్టీ వారు పదే పదే అంటున్నారని.. తనను రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని స్పష్టం చేశారు. తాను పేదోడినని.. కడుపు కొట్టవద్దని వేడుకున్నారు మొగులయ్య.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.