టీఆర్ఎస్ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని వైఎస్ఆర్టీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. మ వాహనాలను తగులబెట్టి..మాపై దాడులు చేసి.. మళ్లీ మాపైనే కేసులు పెట్టారని ఆమె మండిపడ్డారు. ప్రజల్లో తమ పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి.. ఓర్వలేకే తనను టార్గెట్ చేశారని విరుచుకుపడ్డారు. ఆదివారం హైదరాబాద్(Hyderabad) మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. టీఆర్ఎస్ పార్టీపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) విషయంలో కవిత (Kavitha)పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
''నాకు ప్రాణహాని ఉంది. నా పార్టీ పైకి రాకుండా ఉండేందుకు కేసీఆర్ , ఆయన గుండాలు కుట్రలు చేస్తున్నారు. పాదయాత్ర చేయనీయకూడదని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. మా వాహనాలను తగులబెట్టి మమ్మల్నే సారీ చెప్పమంటారా? ఆ వాహనాలను సీఎం కేసీఆర్‌కు చూపించేందుకు వెళ్తుంటే.. ట్రాఫిక్ ఉల్లంఘనల కింద అరెస్ట్ చేసి.. రిమాండ్ కోరారు. కోర్టు నుంచి అనుమతులు ఉన్నా.. నా పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారు. ఇది నియంత పాలన. వీరి గొయ్యి వీరే తవ్వుకుంటున్నారు. ప్రజలకు అంతా అర్ధమవుతోంది. బండి సంజయ్ యాత్ర సజావుగానే సాగుతుంది. నా యాత్రను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారు. వారిది తాలిబాన్ల భాష. వాళ్ల పార్టీ తాలిబన్ రాష్ట్ర సమితి.'' అని షర్మిల అన్నారు.
పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇస్తామని షర్మిల తెలిపారు. వాటిని చూసిన తర్వాత.. యాత్రకు అనుమతిచ్చేందుకు కాస్త సమయం పట్టవచ్చని.. అందువల్ల సోమవారం తన పాదయాత్ర ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. తన పాదయాత్రను అడ్డుకుంటే కోర్టు ధిక్కరణ కింద హైకోర్టులో కేసు వేస్తానని స్పష్టం చేశారు షర్మిల.
'' సీఎం కూతురు కవిత ఒక ఆడ మనిషి అయి ఉండి లిక్కర్ స్కామ్ చేస్తారా? మీ ఇంట్లోని మహిళలు లిక్కర్ స్కామ్‌లు చేస్తారు. ఇక్కడ నేను పాదయాత్ర చేస్తే సానుభూతి లేదు. కారును లాక్కొని వెళ్లి... పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా? మీ ఇంగిత జ్ఞానం ఏమైంది? 80వేల పుస్తకాలు చదివిన తెలివి ఇదేనా? '' అని షర్మిల ప్రశ్నించారు.
తాను ఎవరిపైనా వ్యక్తిగత దూషణలు చేయలేదని వైఎస్ షర్మిల అన్నారు. వారే తనను మరదలు అని అన్నారని.. ఇప్పటి వరకు క్షమాపణ కూడా చెప్పలేదని విమర్శించారు. 30వేల కి.మీ. పాదయాత్ర చేస్తే రాని ఇబ్బంది.. ఇప్పుడు ఎందుకు వస్తోందని ఆమె ప్రశ్నించారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేకే.. తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు షర్మిల. తమ అవినీతి బయటపెడుతుందనే భయంతో.. టీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారని విరుచుకుపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, YS Sharmila, Ysrtp