ఇందిరాపార్క్ దగ్గర ఒక రోజు దీక్ష చేసిన షర్మిల సాక్షి మీడియాపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతా లైవ్‌లో ఉండగానే సాక్షి కవరేజ్ మాకొద్దని.. మీరు వెళ్లిపోండని ఆమె వ్యాఖ్యానించడంతో అందరూ షాకయ్యారు. మీరెలాగూ మాకు కవరేజ్ ఇవ్వరు కాబట్టి.. వెళ్లిపోవాలని కెమెరామెన్‌కు షర్మిల చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమె పక్కనే ఉన్న తల్లి విజయమ్మ షర్మిలను వారించారు. అయితే తన అన్న కుటుంబానికి చెందిన మీడియా సంస్థపై షర్మిల ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాలతో పాటు వైఎస్ఆర్ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
వైఎస్ జగన్‌తో షర్మిలకు అభిప్రాయభేదాలు ఉన్నాయని.. ఈ కారణంగానే ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి గతంలోనే వ్యాఖ్యానించారు. ఆ తరువాత వైసీపీ నేతలెవరూ షర్మిలతో మాట్లాడిన దాఖలాలు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. తాను సీఎం జగన్ వదిలిన బాణాన్ని కాదని.. తనకు వైసీపీలో ఎందుకు పదవి ఇవ్వలేదనే విషయాన్ని జగన్నే అడగాలని షర్మిల కొద్దిరోజుల క్రితం అన్నారు.
అయితే తాజాగా సీఎం జగన్ ఫ్యామిలీకి చెందిన సాక్షి మీడియాపై షర్మిల బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీన్నిబట్టి షర్మిల సీఎం జగన్‌కు ఎంతలా దూరమయ్యారో అర్థం చేసుకోవచ్చనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే మరికొందరు మాత్రం షర్మిల ఏదో సరాదాగా ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఆ సమయంలో ఆమె హావభావాలను బట్టి ఈ విషయం అర్థమవుతోందని అంటున్నారు. ఏదేమైనా సాక్షి మీడియా విషయంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపినట్టే అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, YS Sharmila