YS Sharmila: దీక్ష ముగించుకుని ఇంటికి వెళుతున్న వైఎస్ షర్మిల అరెస్ట్..

వైఎస్ షర్మిల

YS Sharmila: దీక్ష ముగించుకుని ఇంటికి వెళుతున్న వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Share this:
    తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల.. అనంతరం కాలినడకన తన నివాసమైన లోటప్‌పాండ్‌కు బయలుదేరారు. అయితే ఆమెను మార్గమధ్యంలోనే తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలంటూ మూడు రోజులు నిరాహార దీక్ష చేయాలని భావించిన వైఎస్ షర్మిలకు పోలీసులు ఒక రోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే కాలినడకన ఇంటికి వెళ్లి అక్కడ మరో రెండు రోజుల పాటు దీక్ష కొనసాగించాలని షర్మిల భావించారు. ఈ క్రమంలో కాలినడకన ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్‌లోని తన నివాసానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో బీఆర్కే భవన్ దగ్గర ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

    ఇక తన దీక్ష సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే కేసీఆర్‌కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. యువతకు న్యాయం జరగాలని, నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు తమ దీక్షలు కొనసాగుతాయన్నారు. ఇవాళ తను ప్రారంభించిన దీక్ష.. 72 గంటల పాటు కొనసాగుతుందని సంచలన ప్రకటన చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర ప్రారంభించిన దీక్షకు పోలీసులు ఒక రోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే షర్మిల తాజా ప్రకటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై పోలీసుల నుంచి ప్రకటన రావలసి ఉంది. షర్మిల దీక్షకు బీసీ సంఘాల జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, రచయిత కంచె ఐలయ్య తమ మద్దతు ప్రకటించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: