Success story: హైదరాబాద్ కుర్రోడికి నెట్‌ఫ్లిక్స్‌లో బంపర్ ఆఫర్

Success story: హైదరాబాద్ కుర్రోడికి నెట్‌ఫ్లిక్స్‌లో బంపర్ ఆఫర్

శ్రీ ప్రియతం

చిన్నపాటి ఓటమికే తమ జీవితమే పోయిందనుకునే లక్షలాది మందికి శ్రీ ప్రియతం సక్సెస్ స్టోరీ స్ఫూర్తి దాయకం..!

 • Share this:
  ఇంటర్ ఫెయిల్ అయ్యామని తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. టెన్త్‌లో తప్పామని వేలాది మంది చిన్నారులు మానసికంగా క్రుంగిపోతున్నారు. పేరెంట్స్ ఒత్తిడికి చిత్తవుతూ..ఫ్రెండ్ సర్కిల్‌లో పరువు పోతుందని భయపడుతూ...తనువు చాలించుకుంటున్నారు. చదువులో రాణించకుంటే జీవితం వ్యర్థమన్న భావనతో బతుకుతున్నారు. కానీ అవన్నీ తప్పని.. చదువు లేకున్నా అద్భుతాలు సృష్టించవచ్చని ఈ కుర్రాడు నిరూపించాడు. నచ్చిన వృత్తిని ఎంచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నాడు.

  ఇతడి పేరు శ్రీ ప్రియతం. హైదరాబాద్‌కు చెందిన కుర్రాడు.  తనకు చదువు అబ్బదని పదో తరగతిలోనే తెలుసుకొని.. ఆ తర్వాత చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఎలాగోలా కష్టపడి అత్తెసరు మార్కులతో పది పాసయ్యాడు. తల్లిదండ్రులు కూడా బలవంతం చేయలేదు. దాంతో తనకు నచ్చిన చిత్రకళ వృత్తినే కేరిర్‌గా ఎంచుకొని అద్భుతాలు సృష్టించాడు శ్రీప్రియతం. ఈ రోజు ప్రపంచంలోనే పేరొందిన సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ అఫిషియల్ ఇలుస్ట్రేటర్‌గా ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచాడు. శ్రీ ప్రియతం న్యూస్18తో ప్రత్యేకంగా మాట్లాడారు.

  అసలు ఇలుస్ట్రేటర్స్ ఏం చేస్తారు? ఈ కళ గురించి కాస్త వివరంగా చెప్పండి
  ఇలుస్ట్రేటర్ అంటే చిత్రకారుడే.  ఒక అంశానికి సంబంధించిన విషయాన్ని తన పెయింటింగ్ రూపంలో చెప్పాలి. అలా పెయింటింగ్ వేసే వాళ్లని ఇలుస్ట్రేటర్ అంటారు. చిత్రకారుడికి ఇలుస్ట్రేటర్ కి పెద్దగా వ్యత్యాసాం ఉండదు.

  నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రేంజర్ థింగ్స్ -3కి శ్రీ ప్రియతం వేసిన ఇలుస్ట్రేషన్


  ఈ అవకాశం రావడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు?
  చాలా సంతోషంగా ఉంది. నాకు పదో తరగతిలోనే ఒక క్లారీటి వచ్చింది. నాకు ఏం రాదో.. ఏం వచ్చో నాకు అప్పుడే తెలిసింది. వాస్తవానికి నేను అంత తెలివైన స్టూడెంట్ కాదు. అతి కష్టంపై పదోతరగతి కంప్లీట్ చేశాను. చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే పని చేశాను. ఈరోజు ఈ అవకాశం రావడానికి కారణం అదే.

  రజినీకాంత్ ఇలుస్ట్రేషన్


  అసలు నెట్‌ఫ్లిక్స్ మిమ్మల్ని ఎలా సంప్రదించింది? ఎలా గుర్తించింది?
  నెట్‌ఫ్లిక్స్‌కు కనీసం నేను దరఖాస్తు కూడా చేయలేదు. నిజం చెప్పాలంటే సోషల్ మీడియా వల్లే ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది.  నేను వేసిన పెయింటింగ్స్ ఎప్పటికప్పుడు  నా సోషల్ మీడియా పేజెస్‌లో పోస్ట్ చేస్తుంటాను. అలా నా వర్క్ నచ్చి నాకు మెయిల్ చేశారు . స్ట్రేంజర్ థింగ్స్ 3 సిరిస్ కి ఇలుస్ట్రేసన్ వెయ్యమన్నారు. ఈ సిరీస్ కోసం దాదాపు 16 దేశాల నుంచి ఇలుస్ట్రేటర్స్ ను ఎంపిక చేశారు. మన దేశం నుంచి నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ 16 దేశాల ఇలుస్ట్రేటర్స్ వేసి వాటిలో నాది ఫైనల్ చేసి అగ్రిమేంట్ చేసుకున్నారు.  నెట్‌ఫ్లిక్స్ కంపెనీ పాలసీ దృష్ట్యా అమౌంట్ ఎంత అనేది చెప్పకూడు. కాకపోతే పెద్ద మొత్తంలోనే ఆఫర్ చేశారు.

  శ్రీ ప్రియతం ఇలుస్ట్రేషన్


  ఈ కాలం యువతకి మీరేం చెప్పదల్చుకున్నారు?
  ధృడమైన సంకల్పం ఉంటే యువత ఏమైనా సాధించగలరు. తమ ప్రతిభను ప్రదర్శించడానికి నేటి కాలంలో ఎన్నో వేదికలు ఉన్నాయి. వాటి ద్వారా మనమేంటో మన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించవచ్చు. నిజంగా దమ్ముంటే జీవితంలో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

  చేతిలో మొబైల్ లేకుంటే కాళ్లుచేతుల ఆడని రోజులివీ..!  యూత్ అంతా సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మంచి ఎంతుందో.. చెడు కూడా అదే ఉంటుంది. ఐతే వాటిలో మంచిని మాత్రమే తీసుకునే యువత అరుదుగా కనిపిస్తుంటారు. అపజయం వచ్చిందని ఆగిపోకుండా..ఓటమి నుంచే విజయానికి దారులు వెతుక్కునే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో ఒకడు శ్రీ ప్రియతం. చిన్నపాటి ఓటమికే తమ జీవితమే పోయిందనుకునే లక్షలాది మందికి శ్రీ ప్రియతం సక్సెస్ స్టోరీ స్ఫూర్తి దాయకం..!
  First published: