పుష్కర కాలం పాటు ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. ఫోన్‌లో చాటింగ్(Chatting),వీడియో కాల్స్(video calls), సినిమాలు, షికార్లు...ఒకటేంటి డీప్ లవ్ లోకి దింపి ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లెప్పుడని అడిగితే ఎవరూ చూడకుండా మెడలో ఓ పసుపుతాడు వేసి..ఆమె నోరు మూయించాడు. సీన్ కట్ చేస్తే రాత్రికి రాత్రే మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని అత్తారింటికి చెక్కేశాడు దొంగప్రియుడు. ప్రియుడి ప్రేమ నాటకంలో పావుగా మారిన యువతి మోసపోయినట్లు తెలుసుకొని పెళ్లి జరిగిన ఇంటి ముందే న్యాయం చేయమని ధర్నాకు దిగింది. హైదరాబాద్(Hyderabad)హబ్సీగూడ(Habsiguda)లో ఈఘటన చోటుచేసుకుంది.
ప్రియురాలికి హ్యాండిచ్చాడు..
హైదరాబాద్ రామాంతాపూర్ వెంకట్‌రెడ్డి నగర్‌కి చెందిన శ్రీకాంతచారి అనే యువకుడు..రామాంతాపూర్‌కి చెందిన లక్ష్మీ ప్రేమించుకున్నారు. సుమారు 12ఏళ్లుగా వీరిద్దరు ప్రేమికులుగా కలిసి తిరగడం, శారీరకంగా దగ్గరవడంతో అందరూ శ్రీకాంతచారి లక్ష్మీనే వివాహం చేసుకుంటాడని నమ్మారు. అయితే షడన్‌గా ప్రేమించిన అమ్మాయిని కాదని మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంతచారి. గుట్టుచప్పుడు కాకుండా వేరే యువతి మెడలో తాళి కట్టి ఆమెతో అత్తారింటికి వెళ్లిపోయాడు. ప్రేమించిన యువతి దళితురాలనే సాకుతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు తిరస్కరించారని బాధితురాలు తెలిపింది. తన ప్రియుడు వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి వెంకట్‌రెడ్డి నగర్‌లోని శ్రీకాంతచారి ఇంటి ముందు భైటాయించింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసి ..శారీరకంగా వాడుకున్న శ్రీకాంతచారితో తనకు వివాహం జరిపించి న్యాయం చేయాలని ధర్నాకు దిగింది.
వేరే యువతిని పెళ్లాడాడు..
లక్ష్మీ, శ్రీకాంతచారి చాలా సంవత్సరాలుగా కలిసి తిరుగుతున్న విషయం స్థానికంగా అందరికి తెలియడంతో బాధితురాలికి అండగా నిలిచారు. మహిళా సంఘాలు సైతం ఆమె అండగా ఉంటామని ధర్నాలో కూర్చున్నారు. ఈవిషయంలో తనకు న్యాయం జరిగే వరకు శ్రీకాంతచారి ఇంటి ముందు నుంచి లేచే ప్రసక్తే లేదని..పోరాటం చేస్తానని చెప్పింది. ప్రేమ పేరుతో యువతుల్ని లోబర్చుకోవడం, పెళ్లి ప్రస్తావన తేగానే దళితురాలు అంటూ సాకులు చెప్పి మరొకర్ని వివాహం చేసుకున్న శ్రీకాంతచారి లాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.
శిక్షించాల్సిందే..
బాధితురాలి నిరసనకు మద్దతుగా నిలిచిన మహిళా సంఘాల నేతలు సైతం శ్రీకాంతచారిని కఠినంగా శిక్షించాలని ..దళితురాలు అనే విషయం ప్రేమించినప్పుడో లేదంటే ఆమెతో కలిసి తిరిగినప్పుడో గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లకు బుద్ధి రావాలంటే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Love cheating, Telangana