ఓ యువకుడు ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. నాలుగో అంతస్తు నుంచి యువకుడు కింద పడి మృతి చెందిన దుర్ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగోలు అరుణోదయకాలనీ రోడ్డు నెం. 8, ఎస్ఎస్ఆర్ అపార్ట్ మెంట్ లో రావూరి కిషోర్, స్వర్ణలత దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రావూరి జ్ఞానప్రకాష్ హేమంత్ గ్రూప్-1కు ప్రిపేర్ అవుతున్నాడు.
అయితే గ్రూప్స్ కోసం రాత్రి సమయంలో చదువుకుంటూ నిద్ర వచ్చినప్పుడు నాలుగో అంతస్తుకు వెళ్లి వాకింగ్ చేస్తుంటాడు .అయితే శుక్రవారం తెల్లవారు జామున నిద్ర వస్తున్నట్లు అనిపించడంతో అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తుకు వెళ్లి గోడపై కూర్చున్నాడు. నిద్ర మత్తులో విద్యుత్ వైర్లపై పడి అక్కడి నుంచి నేలపై పడిపోయాడు. పెద్ద శబ్ధం రావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు బయటకు వచ్చి చూడగా హేమంత్ కిందపడి తీవ్ర గాయాలతో కనిపించాడు.
దీంతో వెంటనే తల్లిదండ్రులు హేమంత్‌ను 108లో ఎల్బీనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే హేమంత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి కిషోర్ ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అయితే కన్నకొడుకు ఇలా అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News