రిపోర్టర్ : దస్తగిరి
లొకేషన్ : ఓల్డ్ సిటీ
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు కఠినమైన రోజువారీ ఉపవాసాన్ని పాటిస్తూ పండుగను జరుపుకుంటున్నారు. భారతదేశంలోని చాలా ప్రధాన నగరాలు ,పట్టణాలు రంజాన్ మాసంలో ప్రత్యేకమైన స్ట్రీట్ ఫుడ్ మార్కెట్‌లను సరికొత్తగా పరిచయం చేస్తాయి. అత్యంత రుచికరమైన కబాబ్‌ల నుండి రుచికరమైన బిర్యానీలు వరకూ ఈ మార్కెట్‌లలో అందరికీ అందుబాటులో ఉండే ధరలకే లభిస్తాయి. స్ట్రీట్ ఫుడ్ మార్కెట్‌లలో హైదరాబాద్ మార్కెట్ రుచి మాత్రం వేరు.
ఈ సమయంలో మీరు హైదరాబాద్ నగరంలో ఉన్నట్లయితే లేదా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇదే సరైన సమయం. ఈ సమయంలో మీరు నిజంగా రుచికరమైన విందును ఆస్వాదించే అవకాశాన్ని పొందుతారు. హైదరాబాద్ నగరంలో రంజాన్ మాసంలో తినడానికి ఉత్తమమైన ప్రదేశాలెన్నో ఉంటాయి. ఈ సమయంలో హైదరాబాద్ నగరంలో ఓ విరుద్ధమైన దృశ్యం కనిపిస్తుంది. నగరంలో ఒక భాగం నిద్రిస్తున్న సమయంలో మూసీకి దక్షిణాన ఉన్న దృశ్యం అందుకు భిన్నంగా విద్యుత్ వెలుగులు, రకరకాల వంటకాలతో సువాసనలు వెదజల్లుతూ.. ఇక్కడి వీధుల వెంట ప్రజలు రద్దీగా తిరుగుతూ.. ఈ ప్రదేశం సందడిగా కనిపిస్తుంది. ప్రతి సందు, మూలలో కవ్వాలిస్ - పర్షియన్ ఈదా-ఇమా ఘరీబాన్ అనుకరణీయ స్వరంలో నుస్రత్ ఫతే అలీ ఖాన్ గానం వినిపిస్తూ హుషారు కలిగిస్తుంది.
ఇక, ఈ సీజన్ లో అర్ధరాత్రి వేళ ఇక్కడ గాలిలో వచ్చే సువాసన రారమ్మంటున్నట్లే పిలుస్తుంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ వరసగా ముచ్చటగా కనిపిస్తూ ఇది ఉంది.. అది లేదనకుండా.. ఇరానీ నుండి పర్షియన్ వరకు చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, రకరకాల పక్షుల మాంసంతో కూడిన రకరకాల వంటకాలు నోట్లో నీళ్లు ఊరిస్తుంటాయి.
అందులో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో మీరు హుస్సేనీ ఆలం రోడ్‌లో భారీ రకాల కబాబ్‌లను ఆస్వాదించవచ్చు. పతర్ కా గోష్ట్ (ఆవిరితో వండిన మాంసం), మటన్ సూప్, మరాగ్ (క్రీమ్ మీట్)ల వంటి వంటకాల ఘుమఘుమలు భోజన ప్రియులను ఇట్టే ఆకర్షిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో ఇక్కడ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రూప్ బజార్ కూడా నిస్సందేహంగా నగరంలో అత్యుత్తమ ఫుడ్ పాయింట్‌గా చెప్పొచ్చు. బయట తినడం ఖరీదని భావించేవాళ్లు, ఇక్కడ సరసమైన ధరలో కడుపునిండా భోజనం చేయవచ్చు. ఇక్కడ ఇరానీ టీ, బిర్యానీ, హలీమ్, ఇతర వంటకాలను కూడా రుచిచూడవచ్చు. ఇవి కాకుండా చార్మినార్ ప్రాంతంలో కొన్ని పురాతన బేకరీ దుకాణాలను చూడొచ్చు. ఇక్కడ లభించే మంచి టీ, నాణ్యమైన ఉస్మానియా బిస్కెట్లు, బన్ మాస్కా వంటి ఇతర స్నాక్స్ వాహ్ అనిపించకమానవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haleem, Hyderabad, Local News