Home /News /telangana /

Hyderabad: కొత్తగా కొన్న కారు.. వెయ్యి కిలోమీటర్లు దాటిందని సర్వీసింగ్ కు ఇస్తే.. బిల్లు చూసి ఖంగుతిన్న మహిళ

Hyderabad: కొత్తగా కొన్న కారు.. వెయ్యి కిలోమీటర్లు దాటిందని సర్వీసింగ్ కు ఇస్తే.. బిల్లు చూసి ఖంగుతిన్న మహిళ

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

హైదరాబాద్ లోని ఓ మహిళ కొత్తగా కారును కొన్నది. ఎంతో ఆనందంగా ఆ కారులో షికారు చేసింది. కారు మీటర్ వెయ్యి కిలోమీటర్లు దాటడంతో దాన్ని సర్వీసింగ్ కు ఇచ్చింది. ఆ సర్వీసింగ్ బిల్లును చూసి ఆమె కంగుతింది. అసలేం జరిగిందంటే..

  కొత్తగా వాహనాలను కొనేవాళ్లకు కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటుంటాయి. మొదట ఫలానా వాళ్లే నడపాలనీ, బంధువులనో, స్నేహితులనో మొదటగా ఎక్కించుకుని రైడ్ కు వెళ్లాలని ఉంటుంది. ఆ కొత్త వాహనంపై వీలయినంత ఎక్కువ సమయం పాటు రైడ్ చేయాలనిపిస్తుంటుంది. నాది అన్న భావన ఆ వాహనంపై కలుగుతుంది. వాహనం తాళాలు ఎవరైనా పని ఉండి అడిగినా ఇవ్వడానికి కొందరు వెనకాడుతుంటారు. అలాంటిది తాను కొత్తగా కొనుక్కున్న వాహనం అంతకుముందే ఓ వ్యక్తి వాడినదని తెలిస్తే. కొత్త వాహనం కొన్నానని సంబరపడిన ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురయింది. షోరూంలో కొత్త కారు అని తనకు అంటగట్టిన ఓ కారు, సెకండ్ హ్యాండ్ దని తెలిసి అవాక్కయింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  హైదరాబాద్ లోని కొండాపూర్ లో అనుషా ముక్కెర అనే మహిళ నివసిస్తోంది. ఆమె బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని మోరీస్ గ్యారేజెస్ డీలర్ రామ్ 4 వీలర్స్ ఎల్ఎల్పీకి గతేడాది డిసెంబర్ 4న వెళ్లింది. కొత్తగా ఓ కారును కొనాలనుకుంటున్నట్టు షోరూం నిర్వాహకులకు చెప్పింది. దీంతో వారు ఎంజీ జేఎస్ ఈవీ ఎక్స్ క్లూజివ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆమెకు చూపించారు. దాన్ని 24.50 లక్షల రూపాయలకు కొనుక్కునేందుకు ఆమె ఓకే చెప్పారు. అడ్వాన్స్ గా ఆమె రూ.50వేలు కూడా ఇచ్చింది. ప్రక్రియ అంతా ముగిసిందని చెప్పి జనవరి 5న ఆమెకు షోరూం నిర్వాహకులు కారును అందజేశారు. వాస్తవానికి కారును ఇచ్చే టైమ్ లోనే టెంపరరీ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాలను షోరూం నిర్వాహకులు అందించాల్సి ఉంది.

  కానీ వాటి విషయమై ఆమె అడిగినప్పుడల్లా ’తొందర్లోనే పంపిస్తాం మేడం, ప్రాసెసింగ్ లో ఉంది‘ అని చెప్పేవాళ్లు. కారు వచ్చింది కదా అని దాన్ని పెద్దగా ఆమె పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే కారు వెయ్యి కిలోమీటర్ల దూరం నడవడం పూర్తయింది. దీంతో ఆమె కారును సర్వీసింగ్ కు ఇచ్చింది. కారు సర్వీసింగ్ బిల్లులో తన పేరుకు బదులుగా వికాస్ ముదికుంట అనే పేరు ఉండటం ఆమెను షాక్ కు గురిచేసింది. కారు నాదయితే, వేరే వ్యక్తి పేరుతో బిల్లు ఇవ్వడమేంటని నిలదీస్తే, సర్వీసింగ్ సిబ్బంది అసలు విషయం చెప్పారు. ఈ కారు ఆ వ్యక్తి పేరుతోనే రిజిస్టర్ ఉందని చెప్పడంతో ఆమె కంగుతింది. దీంతో ఆమెకు మొత్తం విషయం అర్థం అయింది. వేరొకరు వాడిన కారును తనకు అంటగట్టారని గుర్తించింది. అందుకే రిజిస్ట్రేషన్ పత్రాల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలుసుకుంది. దీంతో ఈ విషయమై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. షోరూం యజమాని అమిత్ రెడ్డి, ఈవీ డివిజన్ మేనేజర్ ఆసిం, అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ రవికిరణ్, సేల్స్ మన్ రక్షిత్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, Electric vehicle, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు