హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad:ఇళ్లలో పనిచేసుకునే మహిళది ఎంత మంచి మనసు..ఏం చేసిందంటే

Hyderabad:ఇళ్లలో పనిచేసుకునే మహిళది ఎంత మంచి మనసు..ఏం చేసిందంటే

(Photo Credit: Twitter)

(Photo Credit: Twitter)

Hyderabad: ఆమెది చిన్న జీతం. కాని పెద్ద మనసు. అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లే రోగులకు ఎంతో కొంత సాయం చేయాలనుకుంది. అందుకే తన కష్టార్జితంలో కొంత డబ్బును దాచిపెట్టి వీల్‌ చైర్‌ని కొనుగోలు చేసి ఉస్మానియా ఆసుపత్రికి విరాళంగా అందజేసింది.

ఇంకా చదవండి ...

సాయం చేయాలనే మనసు ఉండాలే కాని స్థాయి అవసరం లేదు. స్థోమత అంతకన్న అవసరం లేదు. అందుకోసం ఎలాంటి అర్హత అవసరం లేదని ఓ మహిళ రుజువు చేసింది. హైదరాబాద్‌ (Hyderabad)జిల్లెలగూడకు చెందిన జి. సోని(G.soni) అనే మహిళ ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital)కి ఓ వీల్‌ చైర్‌(Wheelchair)ని విరాళంగా అందజేసింది. అదేంటి ఉస్మానియా ఆసుపత్రికి వీల్ చైర్ విరాళంగా ఇచ్చిందంటే ఆమె ఏ ఉద్యోగో లేక వ్యాపారో కానుకుంటే పొరపాటుపడినట్లే. సోని (soni)ఇళ్లలో పనులు చేసుకునే సాధారణ మహిళ మాత్రమే. తాను పని చేసుకుంటే వచ్చిన డబ్బుల్లో కొద్ది కొద్దిగా దాచుకొని ఆ డబ్బుతో వీల్ చైర్‌ కొనుగోలు చేసింది. తన చిన్న మొత్తాల పొదుపుతో కొనుగోలు చేసిన వీల్ చైర్‌ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి కానుకగా ఇచ్చింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ (Superintendent)నాగేందర్‌ (Nagender)‌కి అందజేసింది. ఓ సాధారణ మహిళ ఆసుపత్రికి వీల్ చైర్ ఎందుకిచ్చిందని ఉస్మానియా వైద్యులు ఆశ్చర్యపోయారు. వీల్ చైర్ అందజేసిన సోనికి కావాల్సిన వాళ్లు ఎవరూ ఉస్మానియా ఆసుపత్రిలో లేరు. ఆసుపత్రితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఇలా పెద్దమనసు చేసుకొని రోగుల గురించి ఆలోచించడంపై డాక్టర్లు (Doctors)ఆమెను ప్రోత్సహించారు. తన కష్టార్జితాన్ని కానుకగా ఇవ్వడం చూసి ఆమెను అభినందించారు.

చిన్న జీవితం..పెద్ద మనసు..

ఈ విషయంపై సోనిని ఎందుకు ఆసుపత్రికి వీల్ చైర్ సాయం చేయాల్సి వచ్చిందని అడిగితే హాస్పిటల్‌కి రోజుకు వందల సంఖ్యలో రోగులు వచ్చిపోతుంటారని అలాంటి వాళ్లకు ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే సాయం చేశానంటూ చెప్పుకొచ్చింది. సోని చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయిన ఉస్మానియా వైద్యులు ..ఆమె ఇచ్చిన విరాళాన్ని డాక్టర్ల సమక్షంలో స్వీకరించారు. ఇప్పుడు ఆమెను వ్యక్తిగతంగా అభినందిస్తున్నప్పటికి ఆసుపత్రిలో చేపట్టబోయే ఏదైనా కార్యక్రమానికి సోనిని ఆహ్వానిస్తామన్నారు. ఆ సందర్భంలో ఆమెను అభినందిస్తామని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు.ఆమె చేసింది చిన్న సహాయమే అయినప్పటికి ఎందరికో ఉపయోగపడుతుందని..మరెందరిలోనో స్పూర్తిని నింపుతుందని డాక్టర్లు తెలిపారు.

కూలీ డబ్బుతో విలువైన కానుక ..

ట్యాక్సులు కట్టేంత డబ్బున్న వాళ్లు, భవిష్యత్‌ తరాలకు ఆస్తులను అప్పగించే వాళ్లకు రాని ఆలోచన ఓ సాధారణ మహిళకు రావడం నిజంగా అభినందించాల్సిన విషయమని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.  ఇలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకొని..తమకు ఉన్నదాంట్లో ఎంతో కొంత రోగులకు, ఆసుపత్రులకు విరాళంగా ఇస్తే ఎంతో పుణ్యమని సూచిస్తున్నారు మరికొందరు సమాజసేవకులు. ప్రజల్లో సామాజిక సేవ చేయాలనే ఆలోచన సోనిలాగానే అందరికి కలగాలని ఆశిద్దాం.  ఉన్నంతలో సాయం చేయడానికి ముందుకొచ్చేలా ప్రోత్సహిద్దాం.

Published by:Siva Nanduri
First published:

Tags: Government hospital, Greater hyderabad

ఉత్తమ కథలు