(దస్తగిరి, న్యూస్-18 తెలుగు రిపోర్టర్)
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు సరికదా.. ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. మితిమీరిన వేగంతో ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, అమాయకుల ప్రాణాలు సైతం బలిగొంటున్నారు. మితిమీరిన వేగం కొన్నిసార్లు.. నిర్లక్ష్యం మరికొన్నిసార్లు.. ఎంతోమందిని రోడ్డు ప్రమాదాల రూపంలో పొట్టనబెట్టుకుంటూనే ఉంది. తాజాగా హైదరాబాద్ బాలాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది..
బాలాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నెం పుణ్యం తెలియని ఓ మహిళ తన ప్రాణాలు కోల్పోయింది. తన కుమారుడి స్కూల్ బస్సు డ్రైవర్‌కు టిఫిన్ బాక్స్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఒక ట్రాలీ వాహనం ఆమెను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు మొత్తం ఖాళీగా ఉన్నా కూడా.. ఆ డ్రైవర్ రోడ్డు పక్కకు వచ్చి ఆమెను ఢీకొట్టాడు. ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విజువల్స్ చూసిన వాళ్లు.. రోడ్డంతా వదిలేసి ఆమెను ఎందుకు ఢీకొట్టాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.
షాహీన్ నగర్‌లోని వాడే-హబీబ్ కాలనీకి చెందిన 35 ఏళ్ల పర్వీన్ బేగం టిఫిన్ బాక్స్ పంపిణీ చేయడానికి హైవే హోటల్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా గూడ్స్ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే పర్వీన్ ప్రాణాలను బలిగొన్నట్లు తేలింది. పర్వీన్ టిఫిన్ బాక్స్‌ను అల్ఫాలా స్కూల్‌కు చెందిన బస్సు డ్రైవర్‌కు పంపించాల్సి ఉంది. అతను దానిని పాఠశాలలో చదువుతున్న పర్వీన్ 9 ఏళ్ల కుమారుడు మహ్మద్ వజైర్‌కు పంపించాల్సి ఉంది. ప్రమాదంపై బాలాపూర్ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి గూడ్స్ ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ అదుపులో ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.