తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా తాము ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ అంశంపై పిటిషనర్ ఇచ్చిన అభ్యర్ధనను ఈసీ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను హైకోర్టు జూన్ 7కు వాయిదా వేసింది. దీంతో తెలంగాణలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.
తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గత గురువారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపెట్, నకిరేకల్, కొత్తూరు మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్లఉప సంహరణ చేపట్టనున్నారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. మే 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతోపాటు… వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు కూడా ఈనెల 30న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు, గజ్వేల్, నల్గొండ, జల్‌పల్లి, అలంపూర్, బోధన్, పరకాల, మెట్‌పల్లి, బెల్లంపల్లిలో ఒక్కో వార్డుకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, Municipal Elections, Telangana