పెళ్లిళ్లలో గొడవలు జరగడం సహజం. మగపెళ్లి వారికి సరిగా మర్యాదలు చేయలేదని..కట్న, కానుకల విషయంలో అడిగినంత ఇవ్వలేదని..ఆడపడుచు కట్నం తగ్గిందని ఇలా అనేక కారణాలు ఉంటాయి. కాని హైదరాబాద్(Hyderabad)లో మాత్రం కేవలం మగపెళ్లి వారికి వివాహం ముందు రోజు ఇచ్చిన విందులో చికెన్(Chicken)వండి పెట్టలేదని గొడవ జరిగింది. ఈ పంచాయితీ అంతటితో ఆగకుండా పెళ్లి రద్దు చేసుకునే వరకు వెళ్లింది. ఇదెక్కడి అన్యాయం అంటూ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ (Police station)మెట్లు ఎక్కడంతో పోలీసులు కలగచేసుకొని మగపెళ్లి వారిని పిలిపించి సర్ది చెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. అసలేం జరిగిందంటే..
పెళ్లికి బ్రేక్ వేసిన చికెన్ కర్రీ ..
పెళ్లిలో మంగళసూత్రం, పురోహితుడు ఎంత ముఖ్యమో ..మగపెళ్లి వారికి మర్యాదలు అంతే ముఖ్యమని మరోసారి రుజువైంది. హైదరాబాద్‌లో ఓ పెళ్లి వేడుకకు ముందు రోజు అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు ఇచ్చిన విందులో చికెన్ లేదని పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, బంధువులు అలిగారు. ఆపై పెళ్లి కూతురు కుటుంబ సభ్యులతో చికెన్ కూర కోసం గొడవపడ్డారు. జీడిమెట్లలోని షాపూర్‌నగర్‌లోని జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన యువకుడికి కుత్భుల్లాపూర్కి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చమైంది. నవంబర్ 28న వివాహం. అయితే అబ్బాయి తరపు బంధువులు పెళ్లి కోసం ఆదివారమే విడిది ఇంటికి చేరుకున్నారు. అక్కడ అమ్మాయి కుటుంబ సభ్యులు విందు ఏర్పాటు చేశారు. పెళ్లి కూతురు ఫ్యామిలీ మార్వాడి కావడంతో చికెన్, మటన్ లేకుండా కూరగాయల భోజనం వడ్డించారు. అయితే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ చికెన్ వండి పెట్టలేదు ఏంటని ప్రశ్నించడంతో గొడవకు దారి తీసింది.
మగపెళ్లి వారి వింత ప్రవర్తన ..
పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ భోజనం చేయకుండా వెళ్లిపోవడంతో వరుడు అలిగాడు. అమ్మాయి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. మర్యాదలు తెలియని ఇలాంటి వారితో వివాహం మాకు వద్దంటూ రద్దు చేసుకున్నారు. చికెన్ కర్రీ కోసం సోమవారం జరగాల్సిన వివాహం రద్దు కావడంతో బాధతో అంతే పెళ్లి కూతురు తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సీఐకి ఫిర్యాదు చేశారు.
రెండ్రోజులు ఆలస్యంగా..
విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు కుటుంబాల్ని స్టేషన్‌కు పిలిపించి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆగిపోయిన వివాహాన్ని తిరిగి బుధవారం జరిపించాలని సూచించడంతో అబ్బాయి తరపు బంధువులు అంగీకరించారు. దీంతో చికెన్ కర్రీ కారణంగా ఆగిపోయిన పెళ్లి రెండ్రోజుల ఆలస్యంగా జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana News, Wedding