HYDERABAD VOTERS NUMBER IS MORE THAN 15 STATES AND UNION TERRITORIES IN INDIA AK
Hyderabad Elections: దేశంలోని ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే హైదరాబాద్‌లోనే ఓటర్లు ఎక్కువ
ప్రతీకాత్మక చిత్రం
GHMC Elections: నాగాలాండ్, గోవా, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, చండీగఢ్, సిక్కిం, అండమాన్, డామన్ అండ్ డయూ, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ వంటి ప్రాంతాల ఓటర్లను మొత్తం కలుపుకున్నా.. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల సంఖ్య కంటే తక్కువే కావడం విశేషం.
జీహెచ్ఎంసీ ఎన్నికలు మరికొద్ది గంటల్లోనే మొదలుకానున్నాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 74 లక్షలకుపైగానే ఉంది. హైదరాబాద్‌లో దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల వాళ్లు నివాసం ఉంటారు. కొన్ని దశాబ్దాల కాలంలో ఎంతగానో విస్తరించిన హైదరాబాద్ నగరం.. దేశంలో ఆరో అతిపెద్ద నగరమైనప్పటికీ.. అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే హైదరాబాద్ జనాభా ఎక్కువ. దేశంలోని దాదాపు 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే హైదరాబాద్ ఓటర్ల సంఖ్య ఎక్కువ అనే విషయం చాలామందికి తెలియదు.
అరుణాచల్ ప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర వంటి రాష్ట్రాలతో పాటు అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయూ, లక్షద్వీప్ కంటే హైదరాబాద్‌లోనే ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇక నాగాలాండ్, గోవా, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, చండీగఢ్, సిక్కిం, అండమాన్, డామన్ అండ్ డయూ, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ వంటి ప్రాంతాల ఓటర్లను మొత్తం కలుపుకున్నా.. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల సంఖ్య కంటే తక్కువే కావడం విశేషం.
మరోవైపు రేపు జరగనున్న గ్రేటర్ ఎన్నికల ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటికే 9 వేల 101 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు.. బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకానుంది. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. 150 డివిజన్ల పరిధిలో మొత్తం 11 వందల 22 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 74 లక్షల 67 వేల 256మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ విధుల్లో 36 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు.
పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు 30 సర్కిల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ సారి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుండటంతో 28 వేల 500 బాక్స్ లు ఉపయోగించున్నారు. 30 వేలకు పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను వినియోగించనున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి మాస్క్‌లు ఇవ్వడంతో పాటు, ప్రతి పోలింగ్ కేంద్రానికి 2.5 లీటర్ల శానిటైజర్ కూడా అందించాలని నిర్ణయించారు. అందుకోసం 60వేల లీటర్ల శానిటైజర్స్‌ను అధికారులు సిద్ధం చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.