అమెరికా కాన్సులేట్ కొత్త భవనం (US Consulate) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సొంత భవనం నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారయింది. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 340 మిలియన్ డాలర్లతో నిర్మించిన నూతన భవన సముదాయంలో... ఈ నెల 20 నుంచి సేవలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు అమెరికా దౌత్యకార్యాలయం తెలిపింది. ఎలంటి అధికారిక ప్రారంభోత్సవం లేకుండానే.. నూతన భవనంలో సేవలను ప్రారంభించనుంది. నూతన కాన్సులేట్‌లో అందించే వివిధ సేవల వివరాలను యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ (Hyderabad) విభాగం ప్రకటించింది.
ప్రస్తుతం బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో ఉన్న యూఎస్ కాన్సులేట్‌లో.. ఈనెల 15 మధ్యాహ్నం 12:00 గంటల నుంచి కార్యకలాపాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 15వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటల నుంచి.. 20వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు కాన్సులేట్ మూసివేసి ఉంటుంది. ఇక ఈ నెల 20న ఉదయం 8.30 గంటల నుంచి అధికారికంగా నూతన భవనం నుంచి కార్యకలాపాలను ప్రారంభిస్తారు. మొదట అమెరికా పౌరులకు సంబంధించిన అత్యవసర సేలను ప్రారంభించి.. ఆ తర్వాత భారతీయులకు వీసా సేవలను అందిస్తారు. ఈ నెల 20 నుంచి 22 వరకు అమెరికా పౌరులకు సంబంధించిన అత్యవసర సేవలను అందించనుండగా... నూతన ప్రాంగణంలో భారతీయులకు వీసా సేవలు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 23వ తేదీ నుంచి వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకున్న దరఖాస్తుదారులు నానక్‌రాంగూడలోని నూతన ప్రాంగణానికి హాజరుకావాల్సి ఉంటుంది.
బయోమెట్రిక్ అపాయింట్‌మెంట్‌లు, డ్రాప్‌బాక్స్ అపాయింట్‌మెంట్‌లు (ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్నవారు), పాస్‌పోర్ట్ పికప్ సహా ఇతర వీసా సేవలు.. లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్‌లో యథావిధిగా కొనసాగుతాయి. వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై కాన్సులేట్ మార్పు ప్రభావం ఉండదు. వీసా సేవలకి సంబంధించి సందేహాలకు +91 120 4844644 లేదా +91 22 62011000 పై కాల్ చేయవచ్చు. ఇక మార్చి 20వ తేదీ ఉదయం 8.30 వరకూ అత్యవసర సేవలు కోరుకునే అమెరికా పౌరులు +91 040 40338300 నంబరును, మార్చి 20వ తేదీ ఉదయం 8.30 నుంచి అత్యవసర సేవలు కోరుకునేవారు +91 040 69328000 నంబరును సంప్రదించాలని దౌత్యకార్యాలయం పేర్కొంది.
కాన్సులేట్ కార్యాలయం నానక్‌రాంగూడకు తరలింపునకు సంబంధించి అదనపు సమాచారం కోసం ట్విటర్ (@USAndHyderabad),ఇన్‌స్టాగ్రామ్ (@USCGHyderabad) ఫేస్‌బుక్ (@usconsulategeneralhyderabad) ఖాతాలను చూడవవచ్చు. అత్యవసర సందేహాల నివృత్తి కోసం HydACS@state.gov ఈ-మెయిల్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
అమెరికా కాన్సులేట్ కొత్త ఆఫీస్ అడ్రెస్:
సర్వే నెం. 115/1,
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,
నానక్‌రామ్‌గూడ,
తెలంగాణ
పిన్ కోడ్-500032.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Telangana, USA