రిపోర్టర్: దస్తగిర్ అహ్మద్
లొకేషన్: హైదరాబాద్
తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీకేజీ వెనకాల పెద్దల హస్తం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్‌తో సహా అరెస్ట్ అయిన 11 మంది బీజేవైయం నేతలను చంచల్ గూడ జైల్లో పరామర్శించారు కిషన్ రెడ్డి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఆందోళనలో బీజేవైఎం నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం చంచల్‌గూడ జైలుకు వెళ్లి.. బీజేవైఎం నేతలను పరామర్శించారు.
'' ప్రశ్నాపత్రం లీక్ అవడం దుర్మార్గం. ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడంతో నిరుద్యోగులు ఆవేదనకు గురి అవుతున్నారు. తెలంగాణ యువత ఆక్రోశంతో ఉంది. ప్రశ్నాపత్రం లీకేజీలో పెద్దల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి. తమ అసమర్థతను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి, మాఫియా పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.'' అని కిషన్ రెడ్డి అన్నారు.
ప్రశ్నాపత్రం లీకేజీలో యువ మొర్చా నేతలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. పెట్రోల్ పోసి తగల బెట్టడానికి వచ్చారంటూ వారిపై కేసులు పెట్టారని... తగలబెట్టడం మా సంస్కృతి కాదని స్పష్టం చేశారు. తమకు జైళ్లు, కేసులు కొత్త కాదని... తెలంగాణలో మార్పు తీసుకువచ్చే వరకు పోరాటం చేస్తామని అన్నారు. మార్పు బీజేపీ తోనే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారన్న ఆయన.. ప్రజలకోసం దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Kishan Reddy, Local News, Telangana